కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-21 to 30

వేదావినాశినం నిత్యం
య ఏన మజ మవ్యయమ్ |
కథం స పురుషః పార్థ!
కం ఘాతయతి హంతి కమ్? ||21
తాత్పర్యము
ధీమంతులు గల పృథువంశమున జన్మించిన అర్జునా! వివేకము కోల్పోకుము. ఆత్మలు నశించవని, త్రైకాలికా బాధ్యములని, జన్మాదులు లేనివగుటచే స్థిరరూపము కలవని ఎరింగిన వాడెవ్వడునూ ఆత్మలను ఏ శస్త్రాదులచేతనూ చంపించు ప్రయత్నము చేయడు. స్వయముగను ఆ యుద్ధాదులలో చంపు ప్రయత్నమునూ చేయడు. కనుక బుద్ధిమంతుడు చేయు యుద్ధాది క్రియలలో, ఆతడు చంపించునది చంపునది కూడ పాపదుష్టమైన శరీరములనే యని గుర్తించుకొనుము. ఆత్మయొక్క యథార్థస్థితి నీకు తెలియక భ్రమపడి, భీష్మ ద్రోణాదుల ఆత్మలనే చంపుచున్నానని శోకము చెందుచున్నావు. అది విడువుము.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||22

తాత్పర్యము
మానవుడు, ధరించగ శిథిలమైన వస్త్రములను వదలివేయును. వాడుటకు వీలగు క్రొత్త వస్త్రములను తిరిగి ధరించును. పాత వస్త్రమును విడుచుటలోగాని, నూతన వస్త్రమును గైకొనుటలోగాని చింతించడు. సంతోషమునే పొందును.

అట్లే కర్మానుభవమునకై లభించిన శరీరము, ఆ భోగము పూర్తి కాగానే దాని వయసుతో నిమిత్తము లేకుండగ శిథిలమైనదని గుర్తించవలెను. మరో కర్మానుభవమునకు ఈ శరీరము పనికిరాదన్న మాట. దీనిని వదలి నూతన కర్మానుభవమున కనువగు మరొక నూతన దేహమును పొందును. ఇది ధర్మయుద్ధము. ఇందు మరణించిన వారందరకి “రమణీయ దేహములే” లభించుట నిశ్చయము. కనుక ఇక పై దేహమే లభింపక ప్రళయములో ఆత్మ మ్రగ్గిపోవలసి యుండునేమోయనికాని, ఒకవేళ లభించినా, ఇప్పటి శరీరాలకంటే చెట్టు, పక్షి ఇత్యాది అల్ప శరీరములు లభించునేమోననే బెంగకాని నీకవసరం లేదు. ఆనందించవలసిన యుద్ధవిషయంలో శోకించుచున్నావు నీవు.

నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయం త్యాపో
న శోషయతి మారుతః ||23

తాత్పర్యము
నశింపజేయు వస్తువు, నశించు వస్తువులో దూరి కద! తన ప్రభావమును చూపాలనేది నియమము. ఆత్మలు అన్నింటికంటే సూక్ష్మమైనమగుటచే వాటిలో ఏ వస్తువూ దూరి, తన ప్రభావము నాత్మపై చూపలేదు. కావున ఖడ్గాది ఆయుధములు ఆత్మను ఛేదింపజాలవు. అగ్ని ఆత్మను దహింప జాలదు. ఆత్మను నీరుగూడ తడుపజాలదు. వాయువు ఎండింప జేయనూ లేదు. ఆయా వస్తువులకు, ఆత్మ పై తమ ప్రభావమను చూపు శక్తిలేదన్నమాట.

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయం
అక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్య స్సర్వగతః స్థాణుః
అచలోఽయం సనాతనః ||24
అచ్ఛేద్యః — ఛేదింపబడనిది; అయం — ఈ ఆత్మ; అదాహ్యః — దహింప బడనిది; అయం — ఈ ఆత్మ; అక్లేద్యః — తడుపుటకు సాధ్యం కానిది; అశోష్యః — ఎండిపోనిది; ఏవ — నిజముగా; చ — మరియు; నిత్యః — ఎప్పుడూ ఉండేది; సర్వ-గతః — అంతటా వ్యాపించి ఉండేది; స్థాణుః — మార్చలేనిది; అచలః — పరివర్తనలేనిది; అయం — ఈ ఆత్మ; సనాతనః — సనాతనమైనది.

తాత్పర్యము
ఏ వస్తువు చేతనూ ప్రభావితమయ్యెడి స్వరూపము ఆత్మకు లేదు. ఆత్మ ఖండింపబడుట, కాల్చబడుట, తడుపబడుట, ఎండింపబడుట మొదగువాటికి తగినది కాదు.
ఎందులకనగ ఇతి నిత్యము. సూక్ష్మమైనది కనుక అన్నింటిలోనూ వ్యాపించగలదు. అలా వ్యాపించినపుడు ఆయా వస్తువులకనువుగ మారకుండ తనకంటూ ఒక స్థిరమైన రూపముగలది. చలింప దగనిది. అనాదియైనది. అనంతమైనది.

అవ్యక్తోఽయ మచింత్యోఽయం
అవికార్యోఽయ ముచ్యతే |
తస్మా దేవం విదిత్వైనం
నాను శోచితు మర్హసి ||25

తాత్పర్యము
ఆత్మ ఇతర వస్తువులవలె కన్ను మొదలగు జ్ఞానేంద్రియములకు తెలియువాడు గాదు!. మనస్సుతో గూడ ఇట్టివాడని తలంపనశక్యమైనవాడు. కర్మేంద్రియములచే ఏ వికారము పొందింపదగనివాడు. ఇట్లు శాస్త్రము తెలుపుచున్నది. ఆత్మ ఇట్టిదని తెలుసుకొమ్ము. ఇక మాటిమాటికీ దుఃఖించుట మానుము.

అథ చైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో!
నైవం శోచితు మర్హసి ||26

తాత్పర్యము
అతీంద్రియమై, మనస్సుకు అందని ఆత్మను శరీరం కంటే వేరుగ ఉన్నట్లు కొందరు అంగీకరించరు. వారు శరీరమునే ఆత్మయని భ్రమింతురు. అట్టివారు శాస్త్రమునంగీకరించక కేవలము తమ బాహుబలము పైన ఆధారపడుదురు. నేనే వీరిని చంపువాడనని అనడంలో నీవు గూడ అట్లు భ్రమించుచున్నట్లు తోచుచున్నది. వారి అభిప్రాయం ప్రకారమే చూచినా ఆత్మలు ఎల్లపుడు పుట్టుచుండును, గిట్టుచుండును. ఒకవేళ నీవును అట్టి భ్రమకు లోనైయున్ననూ శోకించవలసిన అవసరం లేదు.

బలపరాక్రమములలో నీవు చాలా గొప్పవాడివి. నీబోటిశూరునకు యుద్ధము ఆనందదాయకము కావాలి. ఆత్మ వేరు లేదనుకొనుటచే పరలోక భయము లేదు. చనిపోయినవారందరూ మోక్షమందినట్లే గద!

జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మా దపరిహార్యేఽర్థే
న త్వం శోచితు మర్హసి || 27

జాతస్య — పుట్టినవానికి; హి — యేలనంటే; ధ్రువః — నిస్సందేహముగా; మృత్యుః — మరణము; ధ్రువం — తప్పదు; జన్మ — పుట్టుక; మృతస్య — మరణించినవానికి; చ — మరియు; తస్మాత్ — కాబట్టి; అపరిహార్యే అర్థే — ఈ తప్పని పరిస్థితిలో; న — కాదు; త్వం — నీవు; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
తాత్పర్యము
దేహమునే ఆత్మయని భ్రమించు నాస్తిక పక్షము ప్రకారమైననూ, పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి తిరిగి పుట్టుకయు తప్పదు. పుట్టి, పెరిగి, నశించి, తిరిగి పుట్టుట అనే పరిణామము కలుగుట శరీరములకు పరిహరింప వీలులేనిది గద! ఇత ఎందుకట్టి వానికై శోకించుట?

(ప్రకృతి ద్రవ్యములు చేరి శరీరముగ తయారగుచున్నవి. అట్లు చేరుతూ పెరుగుచున్నవి. అవి విడిపోతూ నశించుచున్నవి, తిరిగి ప్రకృతి ద్రవ్యములుగ మారుటే కద మరణము. ఆ ద్రవ్యము ఎప్పుడూ తరుగదు. అవస్థలు మాత్రము మారును. మార్పులు ఎప్పడూ జరుగుచునేయుండును. ఒక్కొక్కసారి మట్టి, కుండ, పెంకు, తిరిగి మట్టి, చెట్టు, జంతువు, నరుడు ఇత్యాది ఏదో ఒక రూపమును ధరించుచునే ఉండును.కొత్త రూపము దాల్చుటే పుట్టుట, ఉన్న రూపు మారుటే గిట్టుట. ఇది తప్పనిసరి గనుక, అట్లు తలచు నాస్తికునకు గూడ మరణము విషయమై విచారించనవసరం లేదు. అనుచున్నాడు. ఇది తన మతము గాదు)

అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత! |
అవ్యక్త నిధనాన్యేవ
తత్ర కా పరిదేవనా? ||28

తాత్పర్యము
హే అర్జునా! మనుష్య పశుపక్షి మొదలగు శరీరములన్నింటి యొక్క పూర్వావస్థ ఏమిటో నీకు తెలియదు. ఇవెట్లు ప్రారంభమైనవో పూర్వమెట్లున్నవో తెలియవుగద. వీటి చరమావస్థ మరణించిన పిదప ఎట్లుండునో, ఎప్పుడో గూడ తెలియదు. కేవలము ప్రస్తుతమున్న మధ్యస్థితి మాత్రమే తెలియుచున్నది. ఈ అవస్థలు మారుట నీచేతిలో లేదు. ఈ శరీరములు నశించకుండ నీవాపలేవు. అట్టి శరీరములకై విచారమేల? అర్థాత్, శరీరమే ఆత్మయని భావించువాడైనా ప్రస్తుతము విచారించనవసరము లేదు.

ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చి దేనం
ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్ ||29

ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; పశ్యతి — చూచెదరు; కశ్చిత్ — కొందరు; ఏనమ్ — ఈ ఆత్మ; ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; వదతి — చెప్పెదరు; తథా — ఈ విధముగా; ఏవ — నిజముగా చ — మరియు; అన్యః — వేరొకరు; ఆశ్చర్య-వత్ — అంతే ఆశ్చర్య మైనదిగా; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; అన్యః — మరికొందరు; శృణోతి — వినుట; శ్రుత్వా — విన్న పిదప; అపి — అయినాసరే; ఏనం — ఈ ఆత్మ; వేద — అవగతము (అర్థం); న — కాదు; చ — మరియు; ఏవ — అయినాసరే; కశ్చిత్ — కొందరికి.

తాత్పర్యము
జీవుడు పదార్థములన్నింటికంటే, కనిపించే దృశ్యములన్నింటికంటే విలక్షణమైనవాడు. పాపరాశి నశించి, పుణ్యసంపదకల ధన్యుడెవ్వడో, ఆ ఒక్కడు మాత్రమే ఆత్మ స్వభావము నెఱుంగగలుగుచున్నాడు. ఆతనికైనా, ఆత్మను గురించి చర్చించి, దర్శించుకొలది అది నిత్యనూతనముగ గోచరించుచునే యుండును.

అత్యాశ్చర్యకరమైన వస్తువును దర్శించినట్లు అట్టి వ్యక్తి ఆత్మను దర్శించుచుండును. అట్లు దర్శించినవారందరూ దానిని వ్యక్తము చేయ సమర్థులు కాజాలరు. ఏ ఒక్కడో మాత్రమే ఉన్నదున్నట్లుగ, ఆత్మయొక్క యాథాత్మ్యమును గూర్చి పలుకుచుండును.

అతని పలుకులును అపూరూప వస్తువును గురించినవగుటచే అవికూడ అంత అద్భుతముగ ఆశ్చర్యమొలికించుచుండును. ఆ పలుకునందరునూ వినకోరరు. ఎన్నో జన్మల సుకృతము పండిన వారెవ్వరో ఏఒక్కరో వినుచుండును. ఎంత వినిననూ ఆతనికి కూడా నిత్యమూ ఆ పలుకులు ఆశ్చర్యమును కలిగించుచునే యుండును.

ఇట్లు దర్శించువానికి, పలుకువానికి, వినువానికి నిత్యాశ్చర్యమును కలిగించుచునే ఉండి గూడ వీరికి తెలిసినదానికంటే ఆత్మతత్త్వము అతీతమై యుండును. అంటే ఆత్మను గూర్చి పూర్తిగ తెలిసికొనుట, తెలుపుట మిక్కిలి దుర్లభము.

దేహీ నిత్య మవధ్యోఽయం
దేహే సర్వస్య భారత! |
తస్మాత్ సర్వాణి భూతాని
న త్వం శోచితు మర్హసి ||30

తాత్పర్యము
దేవ మనుష్యాది భేదములలో నున్న దేహములన్నింటి లోపలనుండెడి జీవులందరూ ఒకేరకమైన రూపం కలవారు. ఆయా శరీరములు నశించినా, అందలి జీవులు మాత్రం నశించరు. కావున భరతవీరుడా అర్జునుడా! నీవు భీష్మద్రోణాదులను గూర్చి మాత్రమే కాదు. దేవతలు మొదలు స్థావరములదాక గల ఏ భూతముల గురించి గాని శోకించవలసిన అవసరం లేదు.

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *