స్వధర్మ మపి చావేక్ష్య
న వికంపితు మర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోఽన్యత్
క్షత్రియస్య న విద్యతే ||31
తాత్పర్యము
అర్జునా! క్షత్రియునిగ దోషులను దండించుట నీ ధర్మము. ధర్మరక్షణకై యుద్ధము చేసి కొందరిని సంహరించినా అది నీకు పాపావహము కాదు. కర్తవ్యపాలనయే పుణ్యావహమగును. అట్టి యుద్ధము మానుట దోషమగును. కనుక స్వధర్మ పరిపాలన చేయుటలో చలించుట నీవంటివానికి తగదు.
ఈ యుద్ధము న్యాయమును సంరక్షించుటకై ఎదురైన యుద్ధము. ఇది ధర్మ్యము, అనగ, ధర్మము నతిక్రమించనిది. క్షత్రియునకు న్యాయరక్షణకై తటస్థపడు ధర్మయుద్ధముకంటె శ్రేయోదాయకమగు కర్మ వేరేమి ఉన్నది?
యదృచ్ఛయా చోపపన్నం
స్వర్గద్వార మపావృతం |
సుఖినః క్షత్రియాః పార్థ!
లభంతే యుద్ధ మీదృశమ్ ||32
తాత్పర్యము
ఈ యుద్ధము నీవు కావాలని ఆశించలేదు. దానంతట అదియే త్రోసుకు వచ్చినది. స్వధర్మపాలన, మనుజునకు నేరుగ మోక్షప్రాప్తిని కలిగించును. నీకీ యుద్ధము స్వధర్మపాలనమే కనుక ఇది చేయుట మోక్షప్రాప్తికి ద్వారం తెరచినట్లే. ఈ యుద్ధములో సుఖము, హితము కూడ చేరియున్నవి. ఇంత మంచి అవకాశము, ఎంత భాగ్యము చేసుకున్న వానికో గాని లభించదు గద! ఆ అదృష్టము నిను వెతుకుకొని వచ్చినది. ఆహా!
అథ చేత్ త్వమిమం ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి |
తత స్స్వధర్మం కీర్తిం చ
హిత్వా పాప మవాప్స్యసి ||33
తాత్పర్యము
క్షత్రియునిగ నీకు విహితమైన, ధర్మము కొఱకైన న్యాయబద్ధమైన ఈ యుద్ధమును చేయనని మొండికేసినచో, అట్టి నీ అజ్ఞానమువల్ల స్వధర్మపాలన చేయని దోషము, దానివల్ల మోక్ష సుఖనాశనము కలుగును. ఇది పైలోకానికి చెందినమాట. ఈ లోకంలో నుండగగూడ, యుద్ధమున జయించినందువల్ల కలుగవలసిన కీర్తి తొలగిపోవును. కర్తవ్యవిముఖత వల్ల నరకమే నీకు గతి.
అకీర్తిం చాపి భూతాని
కథయిష్యంతి తేఽవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిః
మరణా దతిరిచ్యతే ||34
తాత్పర్యము
సుఖము తొలగినా, కీర్తి లభించకున్నా బెంగలేదు. “యుద్ధారంభాన భయముచే అర్జునుడు పారిపోయెను”. ఇత్యాది మాటలతో కౌరవులు మాత్రమే కాక, వారి ద్వారా విన్న సమస్త ప్రాణులూ నీ గురించి ఎల్లప్పుడూ అపకీర్తికరముగ పలుకుచుందురు. చెరగని మచ్చ నీ కీర్తికి ఏర్పడును. సవ్యసాచిగ లోకములోని వీరాధివీరులందరి ప్రశంస పొందిన నీకు ఇట్టి నింద మరణ సదృశమే గాదు, అంతకంటే తీవ్రమగు దుఃఖమును కల్గించును సుమా!
భయా ద్రణా దుపరతం
మన్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్ ||35
తాత్పర్యము
అర్జునా! బంధుప్రీతి చేత, కరుణ చేత యుద్ధమునుండి విరమింపజూచుచున్నావు నీవు. కాని గతంలో నీవు వీరాధివీరుడవని, విజయుడవవి నిన్ను గొప్పగా సంభావించిన దుర్యధనుడు, కర్ణడు మొదలగు మహారథులు యిలాంటి అవకాశమునకే ఎదురుచూచున్నారు. పెద్దలు నిన్ను నిందించినా మంచిదే దోషము లేదు.కాని అయోగ్యులగు వీరే ఈనాడు నిన్ను మిక్కిలి చులకన చేస్తారు. “గతంలో పెద్దమాటలాడి, తీరా యుద్ధము సిద్ధము కాగానే, పిరికితనముచే విరమించి పారిపోయెను” అంటూ నిన్ను శత్రువుల వల్ల భయపడి పారిపోయిన వానినిగ తలంతురు గాని నీ జాలి స్వభావమును పట్టించుకొనరు.
అవాచ్యవాదాం శ్చ బహూన్
వదిష్యంతి తవాహితాః |
నిందంత స్తవ సామర్థ్యం
తతో దుఃఖతరం ను కిమ్? ||36
తాత్పర్యము
నీ శత్రువులందరూ ఆడరాని మాటలతో నీ పరాక్రమమును అధిక్షేపింతురు. “శూరులమగు మా ముందు అర్జునుడే పాటి? మా ముందు వాని ఆటలు సాగవు, బయటనే”. ఇట్లు పిరికివారంతా నిన్నాక్షేపించనారంభించినచో, ఆమాటలను వినుట కంటే మరణించుటే మేలు అని భావించవూ నీవు? ! ఇంతకు మించిన ప్రబలతర దుఃఖమేమున్నది చెప్పు?
హతో వా ప్రాప్స్యసే స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీం |
తస్మా దుత్తిష్ఠ కౌంతేయ!
యుద్ధాయ కృతనిశ్చయః ||37
తాత్పర్యము
వీరమాతయగు కుంతీదేవి గర్భమున జన్మించిన వీరుడా! అర్జునుడా! ధర్మయుద్ధము చేయుచు ఒకవేళ నీవు చంపబడితివా మోక్షమందెదవు. జయించితివా, రాజ్యమును పరిపాలించగలవు. ఈ రెంటిలో ఒకటి హెచ్చు, వేరొకటి తగ్గు అనరాదు.స్వధర్మపాలన చేయుటవల్ల ఏది ఎదురైనా అది శ్రేయస్కరమే. దానివల్ల ఆ కర్మ మోక్షసాధనమై తరింపజేయును. అందుచే స్వధర్మ పాలనకై బద్ధకంకణుడవై లెమ్ము.
సుఖదుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాప మవాప్స్యసి ||38
తాత్పర్యము
ఎవ్వరెవ్వరికి ఏ ఏ పని స్వధర్మమో ఆయా పనిని, ఇంతవరకు నేను తెల్పినట్లు, దేహము, ఆత్మ వేరను వివేకముతో ఆచరించవలెను. ఇది బుద్ధిమంతుడెరుంగవలెను. ఆట్లాచరించుటలో ఆటంకములెదురుకాక మానవు. నీవు యుద్ధము చేసినచో బాణములు తగులుట దానివల్ల దుఃఖము, శత్రువులు చనిపోవుట దానివల్ల సుఖము, రాజ్యలాభము, బంధులాభము ఎటులనో అట్లే స్వధర్మపాలన చేయువానికి గూడ ఆయా స్థితులలో వస్తులాభమో, నష్టమో, దానివల్ల సుఖమో, దుఃఖమో, తలపెట్టిన కార్యములలో జయమో అపజయమో కలుగుచునేయుండును.కాని, సుఖాదులవల్ల పొంగక, దుఃఖాదులెదురైనపుడు కృంగక సమబుద్ధితో స్వీకరించుచు, ఫలమును కోరక, కర్తవ్య బుద్ధితో ముందుకుసాగిననాడు, ఆ బుద్ధిమంతుడెన్నటికిని పాపఫలమగు సంసారముబంధమున పడడు. కావున నీవు కూడ అట్టి సమబుద్ధితో నీకు కర్తవ్యమైన యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఇదియే నీకు శ్రేయస్సు.
ఏషా తేఽభిహితా సాంఖ్యే
బుద్ధి ర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ!
కర్మబంధం ప్రహాస్యసి ||39
తాత్పర్యము
కర్మయోగము నాచరించుట జీవులందరి కర్తవ్యము. దానికి ముందుగ దేహాత్మ వివేకము వల్ల ఏర్పడే ఆత్మతత్త్వజ్ఞాన ముండవలెను. ఆ జ్ఞానముతో కర్మల నెట్లాచరించవలెనో తెలుసుకోవలయును. అప్పుడాచరించునది “కర్మయోగ”మగును.
దానివల్ల ఆత్మ యాథాత్మ్యజ్ఞానము కలుగును. ఆత్మ తత్త్వజ్ఞానమునకే “సాంఖ్య” మని పేరు. అది పొంది ఆచరించే కర్మలకే “యోగ”మని పేరు. అర్జునా! ఇంతవరకు సాంఖ్యమును గూర్చి నీకు తెలిపితిని. ఇక సాంఖ్యమును అంతర్గతముగ కల యోగమును గూర్చి తెలుపగలను వినుము. దీనిని విని, అట్లాచరించుచో సంసారబంధమునుండి నీవు విముక్తడవు కాగలవు.
నేహాభి క్రమ నాశోఽస్తి
ప్రత్యవాయో న విద్యతే |
స్వల్ప మప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ || 40
తాత్పర్యము
నేను చెప్పబోవు కర్మయోగమెంత గొప్పదో వినుము. నిత్య నైమిత్తిక కర్మలు మధ్యలో విడిచినా, శక్తి లేక వదలినా నిష్ఫలములగును. పైగా పాపమునిచ్చును. కామ్యకర్మలు అట్లు కాక ఏ రకముగనైనా పూర్తి చేయక మధ్య విడచినచో బెడిసికొట్టి వ్యతిరేక ఫలములనిచ్చును. అనగా రాక్షస జన్మలను సైతము యిచ్చును గాని యిపుడు నేను చెప్పబోవు ఈ కర్మయోగమున్నదే, దీనికట్టి ప్రమాదములేవీ లేవు.
ప్రారంభించిన పిదప, ఏ కారణముచేతనైనా దీనిని మధ్యలో విడచినా, చేసినంతవరకు వ్యర్ధము మాత్రము కాదు. నిష్పలమూ కాదు. మధ్యలో వదలివేసిన పాపము తగలదు. విపరీత ఫలమునివ్వదు. మరి ఏ కొద్దిగ చేయగలిగిననూ, ఆ స్వల్పాంశమునకు తగినంత ఫలము దక్కుటయేకాక మహత్తరమైన సంసార బంధమును దునుముటలో తోడ్పడును. తద్ద్వార మనలను రక్షించును.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.