కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-14వ అధ్యాయము: గుణత్రయవిభాగయోగం

శ్రీ భగవానువాచ

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యద్‌జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః || 1

శ్రీ భగవానుడు: జ్ఞానాలన్నిటిలోకీ ఉత్తమం, ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మునులంతా సంసారవ్యథల నుంచి, బాధలనుంచి తప్పించుకుని మోక్షం పొందారు.

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |
సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ || 2

ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వరూపం పొందిన వాళ్ళు సృష్టిసమయంలో పుట్టరు; ప్రళయకాలంలో చావరు.

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్‌గర్భం దధామ్యహమ్ |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత || 3

అర్జునా! మూలప్రకృతి నాకు గర్బాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతున్నందువల్ల సమస్త ప్రాణులూ పుడుతున్నాయి.

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజప్రదః పితా || 4

కౌంతేయా ! అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నింటికీ మూలప్రకృతే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని.

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ || 5

అర్జునా! ప్రకృతి వల్ల పుట్టిన సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి.

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ || 6

అర్జునా! వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతి, ఆరోగ్యం కలగజేస్తుంది. అది సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ || 7

కౌంతేయా ! రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకు, ఆసక్తికి మూలమని తెలుసుకో. కర్మలమీద ఆసక్తి కలిగించి అది ఆత్మను బంధిస్తుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత || 8

అర్జునా! అజ్ఞానం వల్ల జనించే తమోగుణం ప్రాణులన్నింటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో. అది పరాకు, బద్దకం, నిద్రలలో ఆత్మను శరీరంలో బంధిస్తుంది.

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || 9

అర్జునా! సత్వగుణం సుఖం చేకూరుస్తుంది; రజోగుణం కర్మలలో చేరుస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదం కలగజేస్తుంది.

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా || 10

అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్వతమోగుణాలను అణచివేసి రజోగుణమూ సత్వరజోగుణాలను అణగద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.

సర్వద్వారేషు దేహే௨స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత || 11

ఈ శరీరంలోని ఇంద్రియాలన్నిటినుంచీ ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్ధిపొందిందని తెలుసుకోవాలి.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ || 12

అర్జునా! రజోగుణం అభివృద్ధి చెందుతున్నప్పుడు లోభం, కర్మలపట్ల ఆసక్తి, అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి.

అప్రకాశో௨ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || 13

కురునందనా! బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం, అజ్ఞానం- ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు.

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే || 14

సత్వగుణం ప్రవృద్ధిచెందిన సమయంలో మరణించినవాడు ఉత్తమజ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు.

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే || 15

రజోగుణం ప్రబలంగా ఉన్న దశలో మృతిచెందితే కర్మలమీద ఆసక్తి కలవాళ్ళకు జన్మిస్తాడు. అలాగే తమోగుణవృద్ధిలో తనువు చాలించినవాడు పామరులకు, పశుపక్ష్యాదులకు పుడతాడు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ || 16

సత్వగుణ సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మలసుఖమూ, రాజసకర్మల మూలంగా దుఃఖం, తామస కర్మలవల్ల అజ్ఞానం కలుగుతాయని చెబుతారు.

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతో௨జ్ఞానమేవ చ || 17

సత్వగుణంవల్ల జ్ఞానం, రజోగుణంవల్ల లోభం, తమోగుణంవల్ల అజాగ్రత్త, మోహం, అజ్ఞానం సంభవిస్తాయి.

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః || 18

సత్వగుణ సంపన్నులకు ఉత్తమలోకాలు సంప్రాప్తిస్తాయి. రజోగుణం ప్రధానంగా వున్నవాళ్ళు మానవలోకాన్నే పొందుతుండగా తమోగుణం కలిగినవాళ్ళు నరకలోకానికి పోతుంటారు.

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో௨ధిగచ్ఛతి || 19

కర్మలన్నిటికీ గుణాలను తప్ప మరోదానిని కర్తగా భావించకుండా, గుణాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు.

గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తో௨మృతమశ్నుతే || 20

శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాలనుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు.

అర్జున ఉవాచ

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే || 21

అర్జునుడు: ప్రభూ! ఈ మూడు గుణాలనూ దాటినవాడి లక్షణాలేమిటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు?

శ్రీ భగవానువాచ

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || 22

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ యో௨వతిష్ఠతి నేఙ్గతే || 23

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః || 24

మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే || 25

శ్రీ భగవానుడు: అర్జునా! గుణాతీతుడి గుర్తులివి: తనకు సంప్రాప్తించిన సత్వగుణసంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణధర్మమైన కర్మప్రవృత్తిని కాని, తమోగుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా వుండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతిగుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చలబుద్ధిని విడిచి పెట్టడు. సుఖదుఃఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణభూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై వుండే ధీరుడు.

మాం చ యో௨వ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే || 26

అచంచలభక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడుగుణాలనూ అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు.

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ || 27

ఎందువల్లనంటే వినాశరహితం, వికారరహితం, శాశ్వత ధర్మ స్వరూపం, అఖండసుఖరూపమూ అయిన బ్రహ్మానికి నిలయాన్ని నేనే.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని ” గుణత్రయవిభాగయోగం” అనే పదునాల్గవ అధ్యాయం సమాప్తం.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది.
భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే.
భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి.
ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

ఈ భగవద్గీత ఇప్పటిది కాదు
ఈ పద్యాలు,తాత్పర్యాలు సేకరణ మాత్రమే.
ఎక్కడన్నా తప్పులుండటం సహజం.
తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు.
ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతులైన మనుషుల లక్షణం.
తప్పులు చెబితే సరిదిద్దుతాము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *