కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-15వ అధ్యాయము: పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 1

శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే || 2

ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || 3

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || 4

ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || 5

అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ || 6

దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి || 7

నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ || 8

వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే || 9

ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః || 10

మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు.

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః || 11

ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ || 12

సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో.

గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || 13

నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || 14

“ వైశ్వానరుడు” అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || 15

సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే || 16

ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః || 17

ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.

యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః |
అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః || 18

నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత || 19

అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు.

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ |
ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత || 20

అర్జునా! అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడూ, కృతార్థుడూ అవుతాడు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “పురుషోత్తమప్రాప్తియోగము” అనే పదునైదవ అధ్యాయం సమాప్తం.

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది.
భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే.
భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి.
ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

ఈ భగవద్గీత ఇప్పటిది కాదు
ఈ పద్యాలు,తాత్పర్యాలు సేకరణ మాత్రమే.
ఎక్కడన్నా తప్పులుండటం సహజం.
తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు.
ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతులైన మనుషుల లక్షణం.
తప్పులు చెబితే సరిదిద్దుతాము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *