కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-18వ అధ్యాయము:మోక్షసన్న్యాసయోగం

అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన || 1

అర్జునుడు: కృష్ణా! సన్యాసం, త్యాగం—వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలచాను.

శ్రీ భగవానువాచ

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః || 2

శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసేకర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదలిపెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం.

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే || 3

దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరి కొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు.

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః || 4

అర్జునా! కర్మత్యాగవిషయంలో నా నిర్ణయం విను. త్యాగం మూడు విధాలు.

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ || 5

యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచిపెట్టకూడదు; తప్పకుండా చేయాలి.

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ || 6

పార్థా! అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టే ఆచరించాలని నిశ్చితమూ, ఉత్తమమూ అయిన నా అభిప్రాయం.

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః || 7

స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిదికాదు. అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామస త్యాగమంటారు.

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ || 8

దుఃఖం కలగజేస్తాయనే భావనతోకాని, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతోకాని నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజసత్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు.

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే௨ర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః || 9

అర్జునా! వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టి ఆచరించడమే సాత్వికత్యాగం.

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః || 10

సత్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించడు; శుభప్రదాలు, సులభసాధ్యాలు అయిన కర్మలను అభిమానించడు.

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే || 11

కర్మలను పూర్తిగా వదలిపెట్టడం శరీరాన్ని ధరించినవాడికి శక్యం కాదు. కనుక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే త్యాగి.

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ || 12

కర్మఫలాలను త్యాగంచేయనివాళ్ళకు మరణానంతరం తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలనుబట్టి దుఃఖకరం, సుఖప్రదం, మిశ్రమం అనే మూడు విధాలైన ఫలాలు కలుగుతాయి. అయితే కర్మఫలాలను విడిచి పెట్టిన సన్యాసులకు అవి అంటవు.

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ || 13

అర్జునా! సర్వకర్మలూ ఫలించడానికి సాంఖ్యశాస్త్రం ఐదు కారణాలు చెప్పింది. వాటిని వివరిస్తాను విను.

అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథక్‌చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ || 14

కర్మలన్నిటికీ శరీరం, జీవాత్మ, ఇంద్రియాలు, వాటి వేర్వేరు వ్యాపారాలు, దైవం అనే ఐదూ కారణాలు.

శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః |
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః || 15

మానవుడు శరీరం, వాక్కు, మనసులతో మంచిపనికాని, చెడ్డపనికాని ఆరంభించడానికి కారణాలు ఈ ఐదే.

తత్త్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః || 16

కర్మలకు సంబంధించిన కారణాలు ఇలా వుండగా బుద్ధి, సంస్కారం లేనివాడు తానే కర్తనని తలుస్తాడు. అలాంటి అవివేకి కర్మస్వరూపాన్నికాని, ఆత్మస్వరూపాన్నికాని సరిగా తెలుసుకోలేడు.

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్‌లోకాన్ న హంతి న నిబధ్యతే || 17

కర్మల విషయంలో అహంకారమమకారాలు లేనివాడు ఈ ప్రాణులన్నిటినీ చంపినా హంతకుడు కాడు; కర్మలు అతనిని బంధించవు.

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః || 18

తెలివి, తెలుసుకోదగ్గది, తెలుసుకునేవాడు—ఈ మూడూ కర్మలకు కారణాలు. అలాగే కర్మకు ఆధారం సాధనం, చేసేపని, చేసేవాడు అని మూడు విధాలు.

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి || 19

గుణాల భేదాన్నిబట్టి జ్ఞానం, కర్మ, కర్త అనేవాటిని సాంఖ్యశాస్త్రం మూడేసి విధాలుగా విభజించింది. వాటిని గురించి చెబుతాను విను.

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ | 20

విడివిడి విభాగాలుగా వుండే ప్రాణులన్నిటిలోనూ అఖండమూ, అవినాశమూ, అవిభక్తమూ అయిన ఆత్మవస్తువును చూసేవాడి జ్ఞానం సాత్వికజ్ఞానమని తెలుసుకో.

పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్‌జ్ఞానం విద్ధి రాజసమ్ || 21

వేర్వేరుగా కనుపించే సర్వభూతాలలోని ఆత్మలు అనేకవిధాలుగా వున్నాయని భావించేవాడి జ్ఞానం రాజసజ్ఞానం.

యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ || 22

తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తమూ అదే అనే సంకుచితదృష్టితో ఏదో ఒకే పనిమీద ఆసక్తి కలిగివుండేవాడిజ్ఞానం తామసజ్ఞానం.

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ |
అఫలప్రేప్సునా కర్మ యత్తత్‌సాత్త్వికముచ్యతే || 23

ఆసక్తి, అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్వికకర్మ అంటారు.

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ || 24

ఫలాభిలాషతో, అహంకారంతో, అధికప్రయాసతో ఆచరించేకర్మను రాజసకర్మ అని చెబుతారు.

అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్‌తామసముచ్యతే || 25

సాధకబాధకాలనూ, తన సామర్థ్యాన్నీ ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామసకర్మ అవుతుంది.

ముక్తసంగో௨నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే || 26

ఫలాపేక్ష, అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్కచేయకుండా కర్మలు చేసేవాణ్ణి సాత్వికకర్త అంటారు.

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో௨శుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః || 27

అనురాగం, కర్మఫలాసక్తి, దురాశ, పరపీడన పరాయణత్వాలతో శుచీ, శుభ్రమూ లేకుండా సుఖదుఃఖాలకు లొంగిపోతూ కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు.

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః నైష్కృతికో௨లసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే || 28

మనోనిగ్రహం, వివేకం, వినయం లేకుండా ద్రోహబుద్ధితో, దుష్టస్వభావంతో, నిరుత్సాహంతో నిరంతరవిచారంతో, కాలయాపనతో కర్మలు చేసేవాణ్ణి తామసకర్త అని చెబుతారు.

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ || 29

ధనంజయా! గుణభేధాలనుబట్టి బుద్ధీ, ధైర్యమూ మూడేసివిధాలు. వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ || 30

పార్థా! కర్మమార్గాన్నీ, సన్యాసమార్గాన్నీ, కర్తవ్యాకర్తవ్యాలనూ, భయాభయాలనూ, బంధాన్నీ, మోక్షాన్నీ గ్రహించే బుద్ధి సాత్వికబుద్ధి.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ || 31

పార్థా! ధర్మాధర్మాలనూ, కార్యాకార్యాలనూ, సరిగా తెలుసుకోలేని బుద్ధి రాజసబుద్ధి.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ || 32

పార్థా! అజ్ఞానాంధకారంవల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్నీ విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి.

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ || 33

పార్థా! మనసు, ప్రాణం, ఇంద్రియాలు—వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలధైర్యం సాత్వికధైర్యం.

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే௨ర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ || 34

పార్థా! ధర్మార్థకామాలపట్ల అభిలాష, అభిమానం, ఫలాభిలాష కలిగివుండే ధైర్యం రాజసధైర్య.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ || 35

పార్థా! బుద్ధిలేనివాడు నిద్ర, భయం, దుఃఖం, విషాదం, మదం—వీటిని విడిచిపెట్టకుండా చేసే ధైర్యం తామసధైర్యం.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి || 36

యత్తదగ్రే విషమివ పరిణామే௨మృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్, ఆత్మబుద్ధిప్రసాదజమ్ || 37

భరతశ్రేష్ఠా! మానవుడికి అభ్యసించేకొద్దీ ఆనందం, దుఃఖవినాశం కలగజేసే సుఖం మూడు విధాలు. దాన్ని గురించి తెలియజేస్తాను విను. ఆరంభంలో విషంలా వున్నా అంతంలో అమృతసమానమయ్యే సుఖాన్ని సాత్వికసుఖమని చెబుతారు. అది నిర్మలమైన బుద్ధివల్ల కలుగుతుంది.

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే௨మృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ || 38

మొదట అమృతతుల్యంగా వుండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు, ఇంద్రియాల కలయికవల్ల కలిగేది—రాజససుఖం అవుతుంది.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ || 39

నిద్ర, బద్ధకం, ప్రమాదాలవల్ల జనించి, ఆదిలోనూ, అంతంలోనూ మోహం కలగజేసే సుఖాన్ని తామససుఖం అంటారు.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః || 40

ప్రకృతివల్ల కలిగిన ఈ మూడు గుణాలతో ముడిపడని వస్తువేదీ భూలోకంలోకాని, స్వర్గలోకంలోకాని, దేవతలలోకాని లేదు.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః || 41

పరంతపా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు వారి వారి స్వభావంవల్ల కలిగిన గుణాలనుబట్టి కర్మలు విభజించబడ్డాయి.

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ || 42

బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు ఇవి: మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వం, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం, దేవుడిమీద నమ్మకం.

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ || 43

పరాక్రమం, పౌరుషం, ధైర్యం, దక్షత, యుద్ధంలో పారిపోకపోవడం దానం, పరిపాలనాసామర్థ్యం—ఇవి క్షత్రియుల కర్మలు.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ || 44

వైశ్యులకు స్వభావంవల్ల కలిగిన కర్మలు: వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం. ఇక శూద్రులకర్మ సేవచేయడం.

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు || 45

తాను ఆచరించే కర్మపట్ల శ్రద్ధ కలిగినవాడు సిద్ధి పొందుతాడు. స్వభావసిద్ధమైన తన కర్మమీద ఆసక్తి వున్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను విను.

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః || 46

సమస్తప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.

శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 47

బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మంకంటే గుణం లేనిదిగా కనుపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || 48

కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలాగ కర్మలన్నిటినీ దోషం ఆవరించి వుంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి || 49

అన్ని విషయాలపట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఆత్మనిగ్రహంతో, ఆశలు లేకుండా, ఫలత్యాగబుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమమైన కర్మాతీత స్థితి పొందుతాడు.

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా || 50

కౌంతేయా! నిష్కామకర్మసిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో, జ్ఞాననిష్ఠ అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను సావధానంగా విను.

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాన్, త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ || 51

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః || 52

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే || 53

పరిశుద్ధమైన బుద్ధికలిగి, ధైర్యంతో మనసును వశపరచుకుని, శబ్దాది విషయాలనూ రాగద్వేషాలనూ విడిచిపెట్టి, ఏకాంతవాసం చేస్తూ, మితంగా తింటూ, మాటలు, శరీరం, మనసులను అదుపులో పెట్టుకుని, నిరంతరం ధ్యానయోగంలో వుంటూ, వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తుసేకరణలను వదలిపెట్టి, మమకారం లేకుండా శాంతస్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు.

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ || 54

అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనినీ ఆశించడు; దేనికీ దుఃఖించడు. సమస్త భూతాలనూ సమభావంతో చూస్తూ నాపట్ల పరమభక్తి కలిగివుంటాడు.

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ || 55

భక్తివల్ల అతను నేను ఎంతటివాడినో, ఎలాంటివాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూపస్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు.

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ || 56

కర్మలన్నిటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహంవల్ల శాశ్వతమూ, నాశరహితమూ అయిన మోక్షం పొందుతాడు.

చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ || 57

హృధయపూర్వకంగా అన్నికర్మలూ నాకే అర్పించి, నన్నే పరమగతిగా భావించి, ధ్యానయోగాన్ని అవలంబించి, నీ మనసు నిరంతరం నామీదే వుంచు.

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి |
అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి || 58

నామీద మనసు నిలిపితే నా అనుగ్రహంవల్ల సంసారసంబంధమైన ప్రతిఒక్క ప్రతిబంధకాన్నీ అతిక్రమిస్తావు. అలాకాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిని పెడితే చెడిపోతావు.

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 59

అహంకారంవల్ల యుద్ధం చేయకూడదని నీవు భావించినా ఆ ప్రయత్నం ఫలించదు. ఎందువల్లనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది.

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో௨పి తత్ || 60

కౌంతేయా! అవివేకంవల్ల నీవు ఇష్టపడకపోయినా, స్వభావసిద్ధమైన స్వధర్మకర్మకు కట్టుబడి పరాధీనుడవై ఆ పని తప్పకుండా చేస్తావు.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి |
భ్రామయన్‌సర్వభూతాని యంత్రారూఢాని మాయయా || 61

అర్జునా! సర్వేశ్వరుడు సమస్తప్రాణుల హృదయాలలోనూ విలసిల్లుతూ, తన మాయతో సర్వభూతాలనూ కీలుబొమ్మలలాగ ఆడిస్తున్నాడు.

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ || 62

అర్జునా! అన్నివిధాల ఆ ఈశ్వరుడినే శరణు వేడు. ఆయన దయవల్ల పరమశాంతినీ, శాశ్వతమైన మోక్షాన్నీ పొందుతావు.

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు || 63

పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా చెయ్యి.

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టో௨సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ || 64

నీ వంటే నాకెంతో ఇష్టం. అందువల్ల నీ మేలుకోరి పరమరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన మరో మాట చెబుతాను విను.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో௨సి మే || 65

నామీదే మనసు వుంచి, నాపట్ల భక్తితో నన్ను పూజించు; నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజమని శపథం చేసి మరీ చెబుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు.

సర్వధర్మాన్‌పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 66

సర్వధర్మాలనూ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటినుంచీ నీకు విముక్తి కలగజేస్తాను. విచారించకు.

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో௨భ్యసూయతి || 67

నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపసు చేయనివాడికీ, భక్తి లేనివాడికీ, వినడానికి ఇష్టంలేనివాడికీ, నన్ను దూషించేవాడికీ ఎప్పుడూ చెప్పకూడదు.

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః || 68

పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నామీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు.

న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |
భవితా న చ మే తస్మాత్, అన్యః ప్రియతరో భువి || 69

అలాంటివాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు.

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |
జ్ఞానయజ్ఞేన తేనాహమ్, ఇష్టః స్యామితి మే మతిః || 70

మన వుభయులకీ మధ్య జరిగిన ఈ ధర్మసంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా వుద్దేశం.

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సో௨పి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||71

ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయలేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది, పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ || 72

పార్థా! నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా! ధనంజయా! అవివేకంవల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా?

అర్జున ఉవాచ

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితో௨స్మి గతసందేహః కరిష్యే వచనం తవ || 73

అర్జునుడు: కృష్ణా! నీ దయవల్ల నా వ్యామోహం తొలగిపోయింది; జ్ఞానం కలిగింది. నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధంగా వున్నాను.

సంజయ ఉవాచ

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమ్, అద్భుతం రోమహర్షణమ్ || 74

సంజయుడు: శ్రీకృష్ణభగవానుడికి మహాత్ముడైన అర్జునుడికీ మధ్య ఇలా ఆశ్చర్యకరంగా, ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను.

వ్యాసప్రసాదాచ్ఛృతవాన్, ఏతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ || 75

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి అతిరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన ఈ యోగశాస్త్రాన్ని చెబుతుండగా శ్రీ వేదవ్యాసమహర్షి కృపవల్ల నేను విన్నాను.

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః || 76

ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతమూ, పుణ్యప్రదమూ అయిన కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను.

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః || 77

ధృతరాష్ట్ర మహారాజా ! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహాశ్చర్యం పొంది ఎంతో సంతోషిస్తున్నాను.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || 78

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడూ, ధనుస్సు ధరించిన అర్జునుడూ వుండేచోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా వుంటాయని మన విశ్వాసం.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని ” మోక్షసన్న్యాస యోగము” అనే పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది.
భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే.
భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి.
ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

ఈ భగవద్గీత ఇప్పటిది కాదు
మన మహా గొప్పవారైన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఉత్తమ గ్రంధం.
ఈ పద్యాలు,తాత్పర్యాలు సేకరణ మాత్రమే.
ఎక్కడన్నా తప్పులుండటం సహజం.
తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు.
ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతులైన మనుషుల లక్షణం.
తప్పులు చెబితే సరిదిద్దుతాము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *