భీష్మద్రోణ ప్రముఖతః
సర్వేషాం చ మహీక్షితామ్ |
‘ఉవాచ పార్థ! పశ్యైతాన్
సమవేతాన్ కురూన్’ ఇతి ||25
సర్వలోకేశ్వరుడగు జగన్నాథుడు శ్రీకృష్ణుడు, అర్జునునికి సారథిగ అత్యంత సులభుడైపోయెను. అతడు చెప్పినట్లు చేసెను. లోకమంతా చూచెను. అయినా ఆ జగన్నాథుడు సిగ్గుపడనేలేదు. భీష్మ ద్రోణాదులే కాదు, సర్వదేశముల రాజులు చూచుచున్ననూ సిగ్గుపడుట లేదు. తనను నమ్ముకున్న వారికోసం తాను ఏమైనా చేయగలననే “ఆశ్రితవ్యామోహ”మనే గుణాన్ని ప్రకటించాలనుకున్నాడు. “అర్జునసారథి”, “పార్థసారథి” అనేదే ఓ బిరుదుగ చేసుకున్నాడు. తాను పార్థసారథియై రథమును ఉభయ సేనా మధ్యన నిలిపి “పార్థా! యుద్ధకాంక్షులై చేరియున్న ఈ కౌరవాదులందరినీ చూడవలెనంటివి గద! చూడుము” అని పలికెను.
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః
పితౄన్ అథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా ||26
శ్రీకృష్ణుని ఆజ్ఞయైన పిమ్మట యుద్ధరంగమున చేరి, అగ్నిలో ప్రవేశించు మిడుతలవలె నిలచియున్న, భూరిశ్రవసుడు మొదలగు తండ్రి వరసవారిని, భీష్ముడు మొదలగు తాతలను, ద్రోణాది ఆచార్యులను, శల్యాది మేనమామలను, దుర్యోధనాది సోదరులను, లక్ష్మణకుమారాది పుత్రులను, మనుమలను, కృతవర్మా మొదలగు సన్నిహితులను ఒక్కసారి కలయచూచెను.
శ్వశురాన్ సుహృద శ్చైవ
సేనయో రుభయో రపి |
తాన్ సమీక్ష్య స కౌంతేయః
సర్వాన్ బంధూన్ అవస్థితాన్ ||27
కృపయా పరయాఽవిష్టో
విషీదన్ ఇదమబ్రవీత్
దృష్ట్వే మం స్వజనం కృష్ణ!
యుయుత్సుం సముపస్థితమ్|28
ఇంకను అక్కడ ద్రుపదాది మామలు, హితము కోరు ఎందరో పెద్దలున్నారు. మొత్తమునకు అందరూ ఎటు చూచినా బంధువులే. అందరినీ ఒకసారి కలియచూచెను. హృదయమున దయ ఆవరించెను. వారి ప్రాణములకు ముప్పు వాటిల్లుననే బాధచే కుమిలిపోవుచు అర్జునుడు ఇట్లు పలికెను.
అర్జున ఉవాచ
సీదంతి మమ గాత్రాణి
ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే ||29
కోరిన వారికానందమునిచ్చు శ్రీకృష్ణా! ఇది ఏమి? నా ఉత్సాహమేమైనది? యుద్ధమునకు సన్నద్ధులై ఇచ్చట చేరిన ఈ నా బంధుజనమును చూడగనే, నా అవయములన్ని శిథిలమై పట్టు సడలు చున్నవి. నోరంతా తడి ఆరిపోవుచున్నది. శరీరము వణకి పోవుచున్నది. ఒడలంతా గగుర్పాటుతో అదురుచున్నది.
గాండీవం స్రంసతే హస్తాత్
త్వక్ చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః || 30
ఎన్నడూ లేనిది, గాండీవము నా చేతినుండి జారుచున్నదే? ఒళ్ళ్తంతా ఇట్లు కాలిపోవుచున్నదేమి? నిలబడుటకు కూడ చేతకాకున్నది. నా మనస్సంతా గిరగిరా తిరిగి పోతున్నట్లున్నది.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.