కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -31,32,33,34,35,36,37,38,39,40

నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ! |
న చ శ్రేయోఽను పశ్యామి
హత్వా స్వజన మాహవే ||31

కేశియను రాక్షసుని చంపి స్వజనమును కాపాడిన కేశవా! నాకిప్పుడీ సమయమున అన్నియు దుశ్శకునములే గోచరించుచున్నవి . స్వజనులను యుద్ధమందు చంపినందున నేను పొందు శ్రేయస్సేమిటో తెలియకున్నది.

న కాంక్షే విజయం కృష్ణ!
న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద!
కిం భోగై ర్జీవితేన వా ||32

శ్రీకృష్ణా! నాకు బంధువధ వల్ల పొందే విజయము అవసరమే లేదు.బంధువధతో పొందే రాజ్యమూ వద్దు. రాజ్యములో ఉండే సుఖములూ వద్దు. నీవేమో, గో, గోప, గోపిజనులను రక్షించి రాజ్యం పొంది గోపాలుడవైతివే. నా బంధువులను మాత్రం నేను చంపుకోవాలా? ఇలా చంపి పొందే రాజ్యంతో నాకేమి పని? సుఖములతో ఏమి? అసలీ జీవితముతో ఏమి పని కనుక?.

యేషామర్థే కాంక్షితం నో
రాజ్యం భోగా స్సుఖాని చ |
త ఇమేఽవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||33

యుద్ధములో జయిస్తే లభించే రాజ్యము, విలాసముల, భోగములు, సుఖములు మొదలగునవన్నియు ఎవరితో కలసి అనుభవింప వలెనని మనము కోరుకొనుచున్నామో!, అట్టి బంధు జనమంతా ప్రాణములు, ధనములు అన్ని వదలివేసి, ఈ సమరాంగణమున యుద్ధమునకై వచ్చి నిలచియున్నారు గద! వీరంతా మరణించడం ఖాయం. అసలిప్పటికే వీరంతా మృతప్రాయులై ఉన్నారు.

ఆచార్యాః పితరః పుత్రాః
తథైవ చ పితామహాః |
మాతులాశ్శ్వశురాః పౌత్రాః
స్యాలా స్సంబంధిన స్తథా ||34

ప్రాణములను తృణప్రాయమగనెంచి ఇక్కడ నిలచిన వారిలో గురువులు, తండ్రిసములు, పుత్ర సదృశులు, అట్లే తాతలు, మామలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు ఇట్లొకరేమి, అన్ని విధముల బంధుత్వము కలవారూ ఉన్నారు.

ఏతాన్ న హంతు మిచ్ఛామి
ఘ్నతోఽపి మధుసూదన! |
అపి త్రైలోక్య రాజ్యస్య
హేతోః కిన్ను మహీకృతే ||35

శ్రీకృష్ణా! నీవు భక్తరక్షణకై మధువనెడి రాక్షసుని చంపి “మధుసూదను”డవైతివి. నేనీ బంధువధ చేయుటకెట్లు అంగీకరించుచున్నావు? ఇట్టి బంధువధ చేసి సంపాదించు త్రైలోకాధిపత్యము గూడ నాకు అవసరము లేదే! ఇక చిన్ని ఈ భూమండలాధిపత్యము కొరకు ఇంత ఘోరకృత్యము ఎట్లు చేయుదును? యుద్ధము చేయనని ఊరకున్న నన్ను, ఒకవేళ, కౌరవులు చంపివేసిననూ సరియే. నేను మాత్రం వారిని చంపదలచుట లేదు సుమా!

నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కా ప్రీతి స్స్యాత్ జనార్దన! |
పాపమే వాశ్రయే దస్మాన్
హత్వైతాన్ ఆతతాయినః ||36

ఇంటికి నిప్పు పెట్టువాడు, విషము పెట్టి చంపదలచు వాడు, నిరాయుధుని చంపువాడు, ధనమునపహరించువాడు, భూమిని ఆక్రమించువాడు, భార్యను అవమానపరచువాడు అను ఈ ఆరుగురు “ఆతతాయులు” అనగ మహాపాపులు. కౌరవులు ఈ ఆరుపాపములను మన విషయంలో చేసారు. అట్టి పాపులగు వీరిని చంపినచో మనలను పాపమే పట్టి పీడించును. పైగా పెదనాన్నగారి పుత్రులును, బంధువులునగు ఈ ధార్తరాష్ట్రులను చంపినందున మనకేమి ప్రీతి కలుగును?

తస్మా న్నార్హా వయం హంతుం
ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా
సుఖిన స్స్యామ మాధవ! ||37

బంధుహింస దుఃఖదాయకమేగాని ప్రీతికరము కాదు కనుక కౌరవులను చంపుట మనకు తగదు. నీవు లక్ష్మీపతివి గద! బంధువులను చంపుకున్న తర్వాత జీవితంలో సుఖదుఃఖములు పంచుకొనువారు లేనప్పుడు జీవితమును ఎలా ఆనందముగ గడుపగలము?

యద్యప్యేతే న పశ్యంతి
లోభోపహత చేతసః |
కులక్షయ కృతం దోషం
మిత్రద్రోహే చ పాతకమ్ ||38

రాజ్యమునంతను తానొక్కడే అనుభవించాలనే లోభము చేత దుర్యోధనుడు వివేకహీనుడైనాడు. ఆతని నాశ్రయించినందున భీష్మాదులున్నూ అట్లే. ఈ యుద్ధము వల్ల లోకంలోని వీరులందరూ నశింతురు. అది పాపమే. జనులందరినీ వంచించి, వధించిన ఘోరపాపము దాపురించును. యుద్ధము చేసినవారందరికీ ఆ దోషము కలుగును. కాని కౌరవులు ఈ విషయమును గుర్తించలేకున్నారు.

కథం న జ్ఞేయ మస్మాభిః
పాపా దస్మాత్ నివర్తితుం |
కులక్షయ కృతం దోషం
ప్రపశ్యద్భి ర్జనార్దన ||39

పోనీ! వంశనాశనము ఈ యుద్ధము వలన జరుగునని మనకి తెలుసు కద! బంధువులను రక్షించుకొనుటచేతనే కద నీకు “జనార్దనుడు” అని పేరు వచ్చినది. ఇంత తెలిసిగూడ ఈ యుద్ధమువల్ల కలిగే బంధువధ అనే పాప కృత్యమునుండి మరలవలెనని ఎందుకు మాకు తెలియజేయవు?

కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మా స్సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నం
అధర్మోఽభిభవత్యుత ||40

ఒక్కొక్క వంశమునందు దానికి తగిన ఆచారము లుండును. ఇవి పరంపరగ సాగుచునే యుండును. వానిని సనాతన ధర్మములని అందురు. ఆచరించు వ్యక్తులుగల వంశములు ఈ యుద్ధమువల్ల నశించును గద! వారితోపాటే వారి వంశాచారములు గూడ లోపించుపోవును. ఈ చోట దురాచారములు ప్రవేశించి వంశమంతయు చెడిపోవును గద!

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *