కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు -41,42,43,44,45,46,47

అధర్మాభిభవాత్ కృష్ణ!
ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ!
జాయతే వర్ణసంకరః ||41

దురాచారములు, వంశములలో చోటుచేసుకోగానే నిరాధారులగు స్త్రీలు చెడు అలవాట్లకు బానిసలగుదురు. స్త్రీలు నియమములు తప్పగనే జాతులన్నియు సాంకర్యమునందును. ఎప్పటినుండో వచ్చే వంశ నియమములు ఎన్నటికీ చెడరాదు. వృష్ణివంశమును ప్రకాశింప జేసిన వాడవు నీవు కద కృష్ణా! వంశాచారములను నశింపజేయు ఈ యుద్ధమును ఎట్లు చేయమందువు?

సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం
లుప్త పిండోదక క్రియాః ||42

ఎవరి వల్ల వంశధర్మాలు చెడి, తద్ద్వారా జాతులు సంకరములగునో అట్టివారు, వారి వంశము గూడ ఘోర నరకము ననుభవించును. అంతే కాదు, ఆచారహీనులగు వీరు చేయు పిండప్రదానాదులు, తర్పణాది కర్మలు నిష్పలములగును. ఒకవేళ వీరు మానివేసిననూ సరియే వీరి పితరులకవి లభించక, లభించిననూ అవి పనికిరాక అంతవరకు వెళ్ళినవారు కూడ అచ్చటనుండి భ్రష్టులగుదురు.

దోషై రేతైః కులఘ్నానాం
వర్ణసంకర కారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః
కులధర్మా శ్చ శాశ్వతాః ||43

బ్రాహ్మణ క్షత్రియాది విభాగాలను “జాతులు” లేక “వర్ణములు” అంటారు. జీవించుటకై చేబట్టిన వృత్తినిబట్టి కులములు ఏర్పడతాయి. ప్రతివ్యక్తి జాతితః పాటించవలసిన విధులు కొన్ని, మరణాంతము ఎప్పుడూ మానరాదు. అవి “జాతిధర్మములు.”అవసరాన్ని బట్టి వృత్తులు మార్చుకోవలసిరావచ్చును. ప్రతి వృత్తికి కొన్ని కొన్నికట్టుబాట్లుంటాయి. ఏ వృత్తిని స్వీకరించిన వారా కట్లుబాట్లు పాటించాలి. ఇవి “కులధర్మములు” లేక “వృత్తిధర్మములు” అవుతాయి. జాతిధర్మాలు ఎట్లు శాశ్వతములో ఆయా వృత్తినంటి పెట్టుకొన్న కులధర్మములు గూడ శాశ్వతములే.పరంపరగా వచ్చే వారికే ఆయా ధర్మములను ఆచరించుటలో నేర్పరితనముండును. చేతకానివారు చేపట్టిన “వృత్తి” సత్పలితములనివ్వదు. పాడగును. వృత్తి సాంకర్యమునకు కారకులయిన ఆ నియమభ్రష్టుల యొక్క ఈ దోషపు కృత్యములచే ఆ జాతి ధర్మ, కుల ధర్మములు రెండూ లోపించి పాడగును.

ఉత్సన్నకులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన!
నరకే నియతం వాసో
భవతీ త్యనుశుశ్రుమ ||44

కుల, వర్ణాశ్రమాచారములను సంకరము చేసి ధర్మభ్రష్ఠులయిన మనుష్యులకు కుంభీపాక, రౌరవాది నరకములే శాశ్వత స్థానములుగా అగునని పెద్దలు చెప్పుచున్నపుడు వింటిమి గద!

అహో బత! మహత్ పాపం
కర్తుం వ్యవసితా వయం |
యద్రాజ్యసుఖ లోభేన
హంతుం స్వజన ముద్యతాః ||45

అయ్యో కృష్ణా! ఇంత ఘోర పాపపు పనికి సిద్ధపడితిమేమిటి? క్షుద్రమైన రాజ్యమును గెలిచి అనుభవించే సుఖమునందలి ఆశ చేత దీర్ఘానందప్రదులగు స్వంత బంధువుల నందరిని చంపివేయుటకు సన్నద్ధులమై నిలచితిమి. ఏమీ దారుణము?

యది మామప్రతీకారం
అశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్ ||46

నిరాయుధుడనైన, ప్రతీకారము చేయక వారి పై జాలితో నిలచియున్న నన్ను కౌరవులు ఆయుధపాణులై బండగుండెతో, నియమమతిక్రమించి చంపివేసితిరేని అది నాకు మరీ మంచిది. నాకు వీర స్వర్గము కల్గును. అది నాకు “క్షేమమే”, కాని వారికీ అదే కలిగినచో ఏమి ప్రయోజనం. నిరపరాధిని నన్ను చంపిన పాపమునకు వారు ఘోరనరకములందెదురు. అది నాకు “క్షేమతరము”. అట్లే కానిమ్ము. చంపనిమ్ము.

సంజయ ఉవాచ
ఏవ ముక్త్వాఽర్జున స్సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం
శోకసంవిగ్నమానసః ||47

ధర్మస్థాపన చేయదలచిన శ్రీకృష్ణుని ముందే, వీర ధర్మమును పాటించవలసిన అర్జునుడు దానిని వీడెను. అతని హృదయము శోకముతో చలించిపోయెను. కారుణ్యము నిండెను. అతనికి కృత్యాకృత్య వివేకము నశించెను. పరాక్రమము నిండవలసిన హృదయమున కారుణ్యము నిండెను. చేతనున్న ధనుర్బాణములను క్రింద పారవైచెను. ఒక్కసారి నిలువలేక రథము మధ్యనే, మాటలాడుతూనే, కూలబడిపోయెను
అని ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పెను.
ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః

మొదటి అధ్యాయం “అర్జున విషాద యోగం” సమాప్తం.

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *