కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-1 to 10

భగవద్గీత – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-1 to 10

సంజయ ఉవాచ
తం తథా కృపయాఽవిష్టం
అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం
ఉవాచ మధుసూదనః || 1
తాత్పర్యము
ఏది తగునో, ఏది పుణ్యమో, ఏది పాపమో నిర్ణయించుకొనలేని స్థితిలోనున్న అర్జునునికి మనస్సంతా కరుణతోనిండిపోయెను. కనులు శోకాశ్రువులతో నిండెను. చూపులు జాలిగొలుపుచున్నట్లుండెను. శోకము పొంగి ప్రవహించున్నట్లుండెను, ఇది రజోగుణ ప్రభావము. మధువను రాక్షసుని సంహరించినట్లు, భక్తుల రజోగుణమును అణచివేయు శ్రీకృష్ణుడే మధుసూదనుడు. అర్జునునిలో కలిగిన రజఃప్రభావమును కూడ అణచదలచి శ్రీకృష్ణుడిట్లు పలుకనారంభించెను.
శ్రీ భగవానువాచ
కుత స్త్వా కశ్మల మిదం
విషమే సముపస్థితం |
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున! ||2

తాత్పర్యము
యుద్ధరంగం సిద్ధమై ఎదురెదురుగ నిలచిన ఈ యిరుసేనల మధ్య, శంఖములూది, బాణములెక్కుపెట్టి విడచుకొనబోయే ఈ సంకట పరిస్థితిలో ఈ క్షుద్రదుఃఖ మెక్కడినుండి దాపురించినదయ్యా నీకు? హే అర్జునా! యుద్ధప్రస్తావన లేకముందు ఉండవలసినది ఈ ఆలోచన. ఇప్పుడు కాదు. అయినా, నీ వంటి వానికి కలుగవలసినది కాదీ శోకము. ముందు వెనుకలు ఆలోచించి పని చేయువానిని “ఆర్యుడు” అందురు. ఏదో సాకుతో బాధ్యతను విడచుటను, ఆర్యులు అంగీకరించరు. నిన్నుచూచి ఆర్యులు నొచ్చుకుందురు సుమా!

యుద్ధము వల్ల నరకము, మానితే స్వర్గము అనుకొనుచున్నావు కాని ఈ దుఃఖము వల్ల యుద్దము మానితే నీకు కలిగెడిది స్వర్గవిరుద్ధమైన ఘోరనరకమే. యుద్ధము మానితే నిన్ను లోకులు కీర్తించెదరనుకొనుచున్నావు. కాని, ఈ యుద్ధముమానితే నీకు చెరగని అపకీర్తియే గతి.

క్లైబ్యం మాస్మగమః పార్థ!
నైతత్ త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||3

తాత్పర్యము
పిరికితనమంటే ఏమిటో పృథువంశములోని వారెవ్వరికీ తెలియదు. వంశ విరుద్ధమైన భయమును నీ దరికి చేరనిచ్చుట తగదు. నీ తేజస్సు చాలును శత్రువులను దహించివేయుటకు. ఆ తేజస్సంతా నీ మానసిక దైన్యము వల్ల నశించుచున్నది. అట్టి ఆత్మనాశకరమగు దైన్యమును వదులుము. లెమ్ము అర్జునా! యుద్ధమునకు సిద్ధపడుము.

అర్జున ఉవాచ
కథం భీష్మ మహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన! |
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హా వరిసూదన! ||4

తాత్పర్యము
హే శ్రీకృష్ణా! నీవు అసురులను మాత్రమే సంహరించితివని వింటిని, బంధువులను కాదుగద! భక్తులకు శత్రువులైన వారిని కూడ సంహరించెదవని తెలియును గాని, గురువులను కాదుగద! ద్రోణుడు నాకు గురువు. భీష్ముడు మాకు పితామహుడు. వీరిరువురను సంహరించమనుట నీకు తగునా? సాందీపుడు మొదలగు గురువులను నీవు సంహరించలేదు. పుష్పాదులతో పూజించితివి. నాకు భీష్ముడు, ద్రోణుడు అట్టివారై యుండగ, వీరిని బాణములతో ఎదిరించి పోరాడమనుచున్నావే? ఇది నీకు తగునా? ఏట్లు చేయగలను నే నీ యుద్ధమును?

గురూ నహత్వా హి మహానుభావాన్,
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే |
హత్వాఽర్థకామాంస్తు గురూనిహైవ,
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ||5

తాత్పర్యము
మిక్కిలి ప్రభావము కలిగినవారును, పెద్దలును అగు భీష్మద్రోణాదులను సంహరించి అనుభవించే రాజ్యభోగముల కంటె, వారిని అట్లే వదలి, నాకు రాజ్యము లేక, అడవుల తిరుగుచు, పొందెడి భిక్షాన్నమే మేలనిపించుచున్నది. ఏలననగా, వారు రాజ్యము, భోగములందు ఆశ కలవారు. వారికి స్వయముగ ఆశలేకున్ననూ, అట్టి ఆశాపీడితుడగు దుర్యోధనుని పక్షాన ఉండుట వల్ల వారిని కూడ ఆ దోషమావరించినది.

యుద్ధము జరిగితే వారు చనిపోవుట నిశ్చయము. తదుపరి ఆ రాజ్యమును పొంది, భోగములను ననుభవించుచునపుడు, ఆయా స్థానములలో ఉండి, ఇదివరలో ఆయా భోగములను వారు అనుభవించు స్థితి జ్ఞాపకమొచ్చుచుండును. అదే సమయాన యుద్ధములో బాణములతో రక్తసిక్తములైన వారి శరీరములు కనిపించును. అప్పుడు ఆయా భోగములును రక్తముతో తడిసినట్లే అసహ్యములై దుఃఖమును కలిగించును. యుద్ధము వల్ల లభించెడి అట్టి రక్తసిక్త భోగములను నేనెట్లనుభవింతును?

న చైత ద్విద్మః కతర న్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||6

తాత్పర్యము
యుద్ధము చేయుట మంచిదో, మానుట మంచిదో, ఏది యుక్తమో మాకు తెలియకున్నది. ఒకవేళ యుద్ధమే జరిగితే మేమే జయింతుమో లేదా వారే జయింతురో చెప్పుట కష్టము గద! అయినా సోదరుల ఎడబాటును క్షణమైనా మేము ఓర్వజాలము. అట్టివారిని చంపివేసినచో. మరి జీవించగలమా కృష్ణా! కాని, ఆ పెదనాన్నగారి పుత్రులగు కౌరవులు మాత్రము యుద్ధసన్నద్ధులై యుద్ధరంగమున, ఎట్టఎదుట చంపుటకో, చనిపోవుటకో సంసిద్ధులై నిలచియున్నారే. నాకిది కష్టముగ ఉన్నది. (వారిని చంపినచో మరి, జీవించగలమా! అంటాడు అర్జునుడు. కాని ఏమనాలి? మమ్ము చెప్పరాని కష్టాలకు బలిచేసిన వారిని చంపకుండ మేమేట్లు జీవించగలము. యానేవ అహత్వా నజిజీవిషామః అని కద అనవలసింది?)

కార్పణ్య దోషోఽపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యత్ శ్రేయస్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే,
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||7

తాత్పర్యము
బంధువధ, వంశనాశములను తలచినకొలది నా హృదయము దీనముగ విలపించుచున్నది. ధర్మమేదో, అధర్మమేదో విడదీయలేక నా మనస్సు స్తబ్దత చెందినది. చేయదగినది, మానదగినది విడదీయలేని అధైర్యము నన్నావరించినది.

అందులకే శ్రీకృష్ణా! నిన్నడుగుచున్నాను. ఇట్టి నాకు, ఏది శ్రేయస్సు అని పెద్దలచే శాస్త్రమునందు నిశ్చయించియున్నారో అట్టి చేయదగిన దానిని వివరింపుము. నేను నీకు శిష్యుడనుగద! క్రయవిక్రయార్హత నాయందు నీకే ఉన్నది. అంతేగాదు, నిన్ను శరణాగతి చేయుచున్నాను కృష్ణా! రహస్యములనెల్ల విప్పి బోధించి నన్ను కృతార్థునిగ తీర్చిదిద్దుము.

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణాం |
అవాప్య భూమా వసపత్న మృద్ధం
రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్ ||8

తాత్పర్యము
శ్రీకృష్ణా! ఇప్పుడు నాకు కల్గిన ఈ శోకము నా ఇంద్రియములనన్నింటిని ఎండించి, తీవ్రముగ తపింప చేయుచున్నది. ఇది తొలగు ఉపాయమేమిటో నాకు గోచరించకున్నది. ఏమి చేసినచో ఈ శోకము చల్లారును? ఘోరమగు యుద్ధముద్వార శత్రువుల నందరను అణచివేసి నిష్కంటకముగ భూమినంతను ఏలుటవల్లనా? లేక యుద్ధము మాని, అస్త్రములను విడచి పర్యవసానముగ వారిచే చంపబడి, స్వర్గాధిపత్యమునందుట వల్లనా? రాజ్యలాభము కానీ, స్వర్గప్రాప్తి కానీ, ఈ రెంటిలో ఏదియూ భీష్మాదులను వధించుటవల్ల కలిగే దుఃఖాన్ని తొలగింపజాలినవి కావు అనిపించుచున్నది.

సంజయ ఉవాచ
ఏవ ముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతపః |
న యోత్స్య ఇతి గోవిందం
ఉక్త్వా తూష్ణీం బభూవ హ! ||9

తాత్పర్యము
అర్జునుడు గుడాకేశుడు. అనగ నిద్ర, బద్ధకములను జయించిన వీరుడు. తన ప్రతాపముతో శత్రువులను నిర్వీర్యులనుచేయు సామర్థ్యమున్నవాడు. అయిననూ శ్రీకృష్ణుడు హృషీకేశుడు గద! హృషీకములనగ మనలను ఆనందింపజేయు ఇంద్రియములు. వీటికి ఆయనే ఈశుడు. అనగ జీవులందరి ఇంద్రియములను తన అధీనంలో పెట్టుకొని నడపించువాడు గోవిందుడగును.

అనగ “గో”భూమిపై “వింద్” దుష్టుల భారము తొలగించి సుఖింప చేయువాడు. అంటే ఎవడో ఒకనిని తాను ప్రేరేపించి అతనిద్వారా దుష్టుల నందరిని దునిమి, భూమిని సుఖింపజేసి “గోవింద” నామమును నిలుపుకొనును. ఇప్పుడు అర్జునుని తన పరికరముగ చేసుకొనదలచి తాను సారథియైనాడు. అది తెలియక “తానే చేయువాడను, తానే మానువాడను కాబోలు” అని భ్రమించిన అర్జునుడు ధర్మ సంస్థాపనకై వచ్చిన భగవానుని ముందరే తెలిసీ తెలియని ప్రేలాపనలు చేసి, చివరకు “నేను యుద్ధమును చేయను” అనిగూడ పలికి నిశ్శబ్దముగ చతికిలబడినాడే! అయ్యో ఏమాశ్చర్యము? ఈతడు మానివేయుదునన్నచో మానగలుగునా? చేయుదునన్నచో చేయగలుగునా? ఏది శ్రీ కృష్ణుడు తలచునో అట్లే జరుపును గద!

తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత! |
సేనయో రుభయో ర్మధ్యే
విషీదంత మిదం వచః ||10

తాత్పర్యము
భరతకుల తిలకమగు ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు వీరుడైవుండి కూడా, ఇరుసేనలకు మధ్యగ నిలచి, కూడని విధముగ, విలపించుచున్నాడు. ధీరుడగు పురుషుడు నలుగురిలో కన్నీరు కార్చుట దోషము గద! అర్జునుని కర్తవ్యోన్ముఖుని గావించుటకు, మిత్రునితో పరాచకములాడునంత సులభముగ కృష్ణుడీ విధముగ పలుకనారంభించెను.

శ్రీకృష్ణుడు, హృషీకేశుడు గద! 18 అక్షౌహిణీల సైన్యమునందలి జీవుల ఇంద్రియములను చలనములేనట్లు, చిత్తరువులుగ నిలిపి ఉంచెను. అర్జునుని ఇంద్రియములను మాత్రము పరాక్రమము వీడి శోకించునట్లు చేసెను. ఆతని శోకము తీర్చుటకే అన్నట్లుగ, ఆతనిని ముందుంచుకొని లోకోద్ధరణకై తాను ఉపదేశించదలచిన “జ్ఞానామృతము”ను ఉపదేశింపనారంభించెను.

భగవద్గీత బోధనల తర్వాత, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. 18 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. చివరికి, పాండవులు విజయం సాధిస్తారు.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.

ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *