కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-11 to 20

శ్రీ భగవానువాచ

అశోచ్యా నన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూన్‌ అగతాసూంశ్చ
నానుశోచంతి పండితాః ||11

తాత్పర్యము
అర్జునా! దుఃఖిచదగని వాటిని గురించి ఇంతవరకు నీవెంత శోకించితివి? ఇచ్చట నిలచిన వీరులందరూ శరీరము, ఆత్మ అను రెండు కలిసియున్నవారు. నీకిది తెలిసియున్నచో, ఈ బంధువధ చేయుట ఎట్లు అని అడిగియుండవు.

అయినా, శరీరముకంటే, ఆత్మ వేరని తెల్సినవాడు పలుకదగు, “నరకము పొందుట”,” పిండములను గైకొనుట”, “తర్పణములు స్వీకరించుట” మొదలగు గొప్ప వాదములు చేయుచున్నావు. శరీరము, ఆత్మ ఈ రెంటిలో, శరీరములో ఏమి చేసినా ప్రాణములను శాశ్వతముగ నీవు నిలుపలేవు. ప్రాణములు పోయి నశించునవి శరీరములు. ఆత్మకు ప్రాణములతో పనియే లేదు. కనుక ఆత్మనుండి ప్రాణము పోవుట అనెడిది సంభవించదు. ఆత్మలను గురించిన జ్ఞానముగల బుద్ధిమంతులు, ఈ రెంటిలో దేనిని గురించియు నీవలె శోకించరు.

*న త్వే వాహం జాతు నాసం
న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః
సర్వే వయ మతః పరమ్ ||12

తాత్పర్యము
అర్జునా! పరమాత్మనగు నేను గతములోనున్నాను, ఇప్పుడున్నాను. ఇక పై గూడ ఉందును. అట్లే నాకంటే వేరైన జీవుడవగు నీవున్నూ గతములో ఉన్నావు. ఇకపైగూడ ఉందువు. జీవులలో రాజులుగ, నౌకర్లుగ వేరు వేరు పేర్లతో, వేరు వేరు కర్మలతో మనం గుర్తించు వీరందరనుగూడ అట్లే. మన మందరమూ నిత్యులమే. అనగ, మూడు కాలములలోనూ నశించకనే యుందుము.

దీనివల్ల తెలియదగినదేమనగా పరమాత్మకు, జీవులకు భేదమున్నది. జీవులలో గూడ పరస్పర భేదమున్నది. ఇది సత్యము. ఈ శ్లోకములో “ఉన్నది ” అని కాక లేదనునది లేదు. ” న ఇతి న “, అని రెండు “న “కారములను ప్రయోగించి శ్రీకృష్ణుడు జీవబ్రహ్మల భేదమును, జీవులలో పరస్పర భేదమున్నూ, జీవుల యొక్క నిత్యత్వమును తనను దృష్టాంతముగ చూపి స్థాపించున్నాడు.

దేహినోఽస్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతర ప్రాప్తిః
ధీర స్తత్ర న ముహ్యతి ||

తాత్పర్యము
అర్జునా! నీవు ధరించిన శరీరము పెరిగే దశలోనున్నపుడు దానిని “దేహ “మందురు. జీవుడు లోపలనున్నపుడు, జన్మించిన నాటినుండి ఐదు సంవత్సరాలదాకా “శైశవ”మందురు. 15 సంవత్సరములు నిండువరకు “బాల్యము” లేక కిశోరావస్థ అందురు. దీనినే కౌమారము అని కూడా అందురు. శైశవము పోయినది, కౌమారము వచ్చినది. లేదా బాల్యము వచ్చినది, 15 సంవత్సరాలు నిండగానే బాల్య శరీరము పోయి యువక శరీరమైనది. ఆ పైన యౌవనము పోయి ముసలితనము వచ్చినది. 45 సంవత్సరములు దాటితే శరీర మనవచ్చు. క్షీణించేది అని అర్థం. లోపలి నీకు మాత్రం మార్పురాలేదు.

శరీరము మాత్రము పూర్వపు అవస్థలను వదలి, ఉత్తరావస్థలను పొందుచున్నది. నీవు దానికి వగచుట లేదు. ఆయా అవస్థలు కలుగకుండ నిలుపుట లేదు. అది దేహధర్మమని గుర్తించి ఆనందించుచున్నావు. మార్పునకై ఎదురు చూచుచున్నావు.

అట్లే పూర్వదేహము వదలి మరో దేహమును ధరించుటగూడ సహజము. దానినీ ఆపలేవు. మార్పును చూచి దుఃఖించరాదు. ఆనందముతో పై మార్పుకై ఎదురుచూడదగును. జన్మ మరణములు శరీరమునకే గాని ఆత్మవగు నీకు కాదు. ప్రస్తుత దేహమును వదలుటను “మరణము” అందురు. క్రొత్త దేహమును ధరించుటను “జన్మ” అందురు. మారుచుండు దేహధర్మములను మారని ఆత్మతో ముడివేసి ఆత్మ నశించునోయని బుద్ధిమంతుడు దుఃఖించడు. భ్రమ చెందడు.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ!
శీతోష్ణ సుఖ దుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాః
తాన్ తితిక్షస్వ భారత! ||

తాత్పర్యము
వీరమాతయగు కుంతీదేవి గర్భాన జన్మించిన అర్జునా! బంధువియోగ దుఃఖాదులు నీవంటి వానికి తగవు. పృథివి, నీరూ, నిప్పు, గాలి, ఆకాశములనెడి పంచభూతముల యొక్క సూక్ష్మాంశలను “మాత్రలు” లేక “తన్మాత్ర”లందురు. తన్మాత్రలు ఇంద్రియములను స్పృశించుటనే “మాత్రా”స్పర్శలందురు. వీటి గుణములగు వాసన, రుచి, రూపం, స్పర్శ, శబ్దములనెడి ఐదు విషయముల యొక్క సూక్ష్మాంశలను గూడ తన్మాత్రలనే అందురు. వాటిని గ్రహించు ఇంద్రియములు శరీరమునందుండును. వాసనను ముక్కు, రుచిని నాలుక, రూపమును కన్ను, స్పర్శను చర్మము, శబ్దమును చెవి గ్రహించును.

ఇట్లు తన్మాత్రలు ఇంద్రియములను స్పృశించుటనే “మాత్రాస్పర్శ” లందురు. ఆయా విషయములు ఆయా ఇంద్రింయముల దరిచేరినపుడు, వాటి స్వభావమును బట్టి నిప్పు వేడిని, నీరు చల్లదనమును, ఈ విధముగ ఇచ్చుచుండును. దావివల్ల సుఖమో దుఃఖమో కలుగుచుండును. ఇవి ఆయా వ్యక్తియొక్క పూర్వకర్మను బట్టి ఏర్పడ్డ శరీరమును బట్టి మారుచునే యుండును. తప్ప, ఎప్పూడూ అందరికీ ఒక్కరీతిగ ఉండవు. శరీరమున్నంతవరకు అవి సంభవించుచునేయుండును. వాటిని సహించువలనేగాని వాటినుండి పారిపోతగదు. శరీరధర్మములను మానరాదు. నీ శరీరధర్మము దుష్టులను శిక్షించుట. అందులకై ధర్మయుద్ధము చేయతగును.

ఓ భరత కులతిలకా! అట్టి యుద్ధము వల్ల కలిగే బంధుజనుల సంయోగ వియోగములవల్ల నీకు కలిగెడి సుఖదుఃఖములను గూడ తప్పనివని గుర్తించి సహించుట అలవరచుకొమ్ము. దుఃఖించకుము.

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ! |
సమ దుఃఖ సుఖం ధీరం
సోఽమృతత్వాయ కల్పతే ||15

తాత్పర్యము
హే పురుష శ్రేష్ఠా! ప్రకృతి వల్ల నీకు కలిగే అనుకూలమైన లేక ప్రతికూలమైన అనుభవములేవైనా త్రోసిపుచ్చ రానివే. ఎండ, వానలవల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అట్లే యుద్ధంలో బంధువధవల్ల కలిగే సుఖమైనా దుఃఖమైనా శరీరముకేనను ధైర్యముతో ఎదుర్కోను సమబుద్ధి కలవానిని “మాత్రాస్పర్శలు” ఏమీ చేయలేవు. అట్టి స్వవర్ణోచిత కర్మను సుఖములెదురైనా, బాధలెదురైనా సమబుద్ధితో, సహనముతో చేయు మానవుడు మాత్రమే అమృతత్వమునందగలడు. అందులకే ఓరిమిని అవలరచుకొమ్ము. అమృతత్వము నందుము.

నాఽసతో విద్యతే భావో
నాఽభావో విద్యతే సతః |
ఉభయో రపి దృష్టోఽన్తస్తు
అనయో స్తత్త్వదర్శిభిః ||16

తాత్పర్యము
అర్జునా! సత్ అనగ “ఏకరూపము”గ ఉండునది. మార్పుచెందక ఉండు వస్తువు. అది ఆత్మ. అది కానిది, అంటే మార్పు చెందునది, ఒకే రూపములో ఉండనిది. “అసత్” అది శరీరము. ఏమి చేసినా, ప్రకృతితో తయారైనది కనుక దేహము నశించక యుండదు. జ్ఞానైకాకారమగు ఆత్మ ఏమి చేసినా నశించనే నశించదు. కనుక ఆత్మకు సత్త్వము, అనగ వినాశము లేకుండుట, శరీరములకు అసత్త్వము, అనగ వినాశమునొందుట సహజ స్వభావములు. ఈ విషయమును తత్త్వమును యదార్థముగ దర్శించిన శ్రీ పరాశరాది మహర్షులు ఎన్నడో నిర్ణయించియున్నారు.

అవినాశి తు తద్విద్ధి
యేన సర్వ మిదం తతమ్ |
వినాశ మవ్యయ స్యాస్య
న కశ్చిత్ కర్తు మర్హతి ||17

తాత్పర్యము
ఆత్మ వినాశమునొందక నిత్యముగ ఉండుటకొక కారణమును తెలిపెదను. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును నశింపజేయవలెనంటే, అందులో దూరి దానిని నశింపజేయవలెను. ఆత్మలు అతిసూక్ష్మములు. ఏ సూక్ష్మ పదార్థము నందైనా ప్రవేశింపగలవు.

కాని ఆత్మయుందు ప్రవేశించగల సూక్ష్మపదార్థమేదియు లేనేలేదు. ప్రకృతిలోని అన్ని పదార్థములయుందు వ్యాపించు శక్తి ఆత్మకున్నది. ప్రకృతివల్ల తయారగు శరీరములన్ని నశించేవే. అన్ని పదార్థములు గూడ ఆత్మ ప్రవేశించు అవకాశము కలవేకాని, ఆత్మలో ప్రవేశించగలదంటూ ఏదీ లేదు. అందుచే ఏ విష శస్త్రాదులున్నూ ఆత్మను ఏమీ చేయలేవు.

అంతవంత ఇమే దేహాః
నిత్య స్యోక్తా శ్శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య
తస్మాత్ యుద్ధ్యస్వ భారత! ||18

తాత్పర్యము
ఈ కనిపించేవి శరీరములు. వీటినే దేహములని అంటారు. దేహమనగ పెరుగునది. శరీరమనగ తరుగునది. ఈ శరీరములు “ఇవి” అని చూపదగియున్నవి. అంటే కొన్ని వస్తువుల సంఘాతమన్నమాట. ఏది, కొన్ని వస్తువుల కూడికచే ఏర్పడునో, అది తిరిగి విడిపోయి నశించును. అందుచే శరీరములు లేక దేహములు గూడ నశించుట తప్పదు.

ఈ మధ్యలో కలిగే మార్పులే పెరుగుట, తరుగుట. బాల్య, కౌమార, యవ్వనాదులు. దేహములవలే జీవునకు ఉత్పత్తి, పెరుగుటలు లేవు కనుక జీవుడు నిత్యుడు. అతనికి కర్మానుభవమునకై శరీరముతో సంబంధమేర్పడినది. అందులో ఆతడు ఉండును కనుక ఆతడు “శరీరి” లేక “దేహీ”. శరీరమువలె కొన్ని అవయవములతో కూడుకొన్నవాడు కాక “ఏకావయవి”. జీవుడు నశించు ప్రశ్న లేదు. అతడు “అనాశీ”. పైగా శరీరములన్ని అనుభవించడానికి వీలైన వస్తువులుగ, భోగ్యవస్తువులుగ తెలియచున్నవి. కనుక వీటిని “ప్రమేయ”ములందురు. కాని జీవుడు అట్లు గాక కర్మఫలమును అనుభవించు భోక్తగ తెలియుచున్నాడు. కనుక జీవుడు “అప్రమేయుడు”. అతనినే “ప్రమాత” అనగ అనుభవించుటకై తెలుసుకొనువాడు అందురు. దీనివలన ఆత్మలు నశించవని, శరీరము నశించుట తప్పదని స్పష్టమగుచున్నది. ఇక విచారమెందుకు? నిస్సంశయముగ కౌరవులతో యుద్ధము చేయుము.

య ఏనం వేత్తి హంతారం
యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే ||19

తాత్పర్యము
ఆత్మ నిత్యమైన ఏకావయవి అని తెలిసెను గద!. ఆత్మ, శస్త్రాదులచే ఒకరిని చంపుటలో కర్తయగునని భావించువాడు అవివేకియే. అట్లే ఎవనిచేతనైనా, ఏ ఆయుధాదులచేతనైనా ఆత్మ చంపబడునని చనిపోవు క్రియలో కర్మగ భావించిననూ అదియును అవివేకమే యగును.

అర్థాత్, అట్టివారిరువురు ఆత్మ తత్త్వమెఱుంగని అవివేకులే యగుదురు. ఆత్మ చంపబడవలెనంటే ఆ శస్త్రాదులు ఏవైనా ఆత్మ లోపల దూరిగద నశింపజేయాలి!. ఆత్మయే అన్నింటికంటే సూక్ష్మమైనదగుటచే ఆ శస్త్రాదులు ఆత్మలో దూరలేవు. కనుక ఆత్మనాశకమగు వేరు వస్తువు లేదు. కావున ఆత్మ చంపబడదు. ఎవరినీ చంపదు గూడ.

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||20

తాత్పర్యము
శరీరానికుండే పరిణామ ధర్మములు ఆత్మలకు లేవని నేను క్రొత్తగ సిద్ధాంతము చేయనవసరం లేదు. ఇది “కఠ” మొదలగు ఉపనిషత్తులలో ప్రసిద్ధము. ఈ ఆత్మలకు జన్మ లేదు. అనగ పెరుగుట, ముసలితనమందుట మొదలగు పరిణామములేవీ ఆత్మలకు లేవు. దేవ, మునుష్య, పశు, స్థావరములలో ఏ శరీరానికైనా, పరిణామము చెందుట అనివార్యము. దేవకోటికి చెందిన బ్రహ్మరుద్రాదుల శరీరములైతే కల్పాదియందు పుట్టి, కల్పాంతము వరకు ఉంటాయి. మిగిలిన శరీరాలు మధ్యలో పుట్టి మధ్యలోనే నశిస్తూంటాయి. కాని ఆయా శరీరాలన్నింటిలో నుండు ఆత్మలు మాత్రము కల్పాదికి ముందు కల్పాంతము తర్వాత గూడ ఉంటాయి. ఆత్మకు జన్మ జరా మృత్యువులు లేవు. కనుక అజుడని పేరు. అందువల్లనే నిత్యుడు అనగ భూత, భవిష్యత్, వర్తమాన కాలములన్నింటిలోనూ ఉండువాడు.

కనుకనే శాశ్వతుడు అనగా పరిణామశూన్యుడు. అతని గురించి తెలిసిననూ, అనుభవించిననూ నూతనముగనే ఉండును. కనుక అతనిని పురాణుడు అందురు. కర్మానుభవమునకై లభించిన శరీరములు హింసింపబడిననూ వీనిలోనుండు జీవులు హింసింపబడవు. ఆత్మలు ఎప్పుడూ చనిపోవు.

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *