వ్యవసాయాత్మికా బుద్ధిః
ఏకేహ కురునందన! |
బహుశాఖా హ్యనంతా శ్చ
బుద్ధయోఽవ్యవసాయినామ్ ||41
తాత్పర్యము
హే అర్జునా! కర్మలనాచరించు జ్ఞానము రెండురకములగ ఉన్నది. ఆయా నిత్య నైమిత్తక, కామ్యకర్మలకు సంబంధించిన ఫలములను కోరి ఆచరించునది.అవి ఆచరిస్తే వచ్చే అవాంతర ఫలములు కోరక “సంసార బంధము తొలగి మోక్షసుఖమనుభవించుట మాత్రమే ” అనే ఒకే ఫలమును కోరి ఆచరించునది. ఈ రెండింటిలో మొదటి దానికంటే రెండవదే శ్రేష్ఠమైనది.
మొదటిదానికి శరీరముకంటే ఆత్మ వేరని తేలిస్తే చాలు. ఆయా కర్మానుష్ఠానముతో ఆయా ఫలములను మాత్రం పొందుచుండును. శరీరాన్ని సుఖపెట్టడానికి కలిగే కోరికలు అనంతములు. అవి తీర్చేందుకు కావలసిన ఫలములూ అనంతములే! ఆ ఫలాలనందించే కర్మలూ అనంతములే! ఒక చెట్టు కొమ్మనుండి మరెన్నో చిగుళ్ళు పెరుగుతూ పోతున్నట్లే. ఆత్మదృష్టి లేని వానికి ఆయా ఫలానుభవ కాంక్షగూడ శాఖోపశాఖమై పెరుగును. దానివల్ల కామ్యకర్మాచరణ, ఫలప్రాప్తి, ఇతర ఫలకాంక్ష, తిరిగి కర్మాచరణ ఇట్లు తిరుగుచునేయుండును. ఒకే ఫలమునందు నిలకడలేదు కనుక వాని జ్ఞానముగూడ బహుముఖముగ నిలకడలేక ప్రసరించుచుండును. వానిని “అవ్యవసాయి” అందురు. వ్యవసాయమనగ నిశ్చయము. అది వీనికి దేనియందూ లేదు.
ఇక రెండవవానికి అశాశ్వతమైన శరీరసుఖముకంటే, శాశ్వతమగు ఆత్మానుభవ సుఖమొక్కటియే చాలునను నిశ్చయముండును. దానికొరకై ఆతడు కర్మానుష్ఠానము సమబుద్ధితో చేయును. ఆ కర్మానుష్ఠానమును చేయునపుడు మధ్యలో ఎన్నో అవాంతర ఫలములు ఎదురైనను వాటి వద్దనే నిలచిపోడు. తన లక్ష్యాన్నించి సడలడు. ఆ కర్మలను గూడ మోక్షసాధనములుగనే ఆచరించును. దీనికి మూలమైన ఆ నిశ్చయానికే “వ్యవసాయాత్మికబుద్ధి” అని పేరు. అది అలవరచుకొమ్ము.
యా మిమాం పుష్పితాం వాచం
ప్రవదంత్య విపశ్చితః |
వేదవాదరతాః పార్థ!
నాన్య దస్తీతి వాదినః ||42
తాత్పర్యము
కామ్యకర్మలయందే కొందరు నిరతులై యుందురు. వారిని అవ్యవసాయులు అంటిని గద. వారు పరమ వైదికుల వలె ఉందురు. వేదపన్నములను ఏకరువు వేయుదురు. ఇహలోక, పరలోకముల యందనుభవించు శారీరక సుఖస్థానములగు స్వర్గాది లోకములకంటే పొందదగినది వేరొకటేదీ లేదని ప్రలపించు చుందురు. వారి మాటలు పైకి వినుటకు ఇంపుగ ఉండును. కాని స్థిరఫల ప్రదములుగ ఉండవు. అట్టివారు అల్పజ్ఞులు.
కామాత్మాన స్స్వర్గపరాః
జన్మకర్మ ఫలప్రదామ్ |
క్రియా విశేష బహుళాం
భోగైశ్వర్య గతిం ప్రతి ||43
తాత్పర్యము
కామ్యకర్మ నిష్ఠులకు వివిధ భౌతిక ఫలములందే మనస్సు తగుల్కొని యుండును. వారు శరీరానంతరముగూడ మోక్షమును కోరరు. క్షుద్రమగు స్వర్గాది లోక సుఖములే సర్వస్వ మనుచుందురు. విపరీతమగు శరీరాయాసజనకములగు కఠిన నియమములతో నిండిన కామ్యకర్మలను ఆచరించు చుందురు. వాటి అనుభవనానికై తిరిగి జన్మ, తిరిగి కర్మ, దానిననుభవించుటకై తిరిగి జన్మ, ఇట్లు సంసార చక్రమునందే గిరగిర తిరుగుచుందురు. వారెప్పుడూ శారీరక సుఖములనే కోరుచూ వాటినొసంగు సంపదలను ఆర్జించుటయందే తమ బుద్ధిని లగ్నం చేసియుందురు.
భోగైశ్వర్య ప్రసక్తానాం
తయాఽపహృత చేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః
సమాధౌ న విధీయతే ||44
తాత్పర్యము
వేదము శాశ్వతసుఖమునిచ్చెడి మార్గములను తెలుపు వాక్యములతోబాటు క్షుద్రఫలముల ననుభవించకోరు వారికి గూడ ఆయా ఫలములను ప్రశంసించు ఎన్నోవాక్యములను చూపినది. నిత్యానందము కోరువారికి, వీటి వైపు పోనవసరం లేదు.కానీ కామ్యకర్మనిష్ఠులు వారికనువైన వాక్యములనే ఎత్తి చూపి, ఎపుడూ వాదించుచుందురు. అట్టి పైపై జ్ఞానం కలవారు ఆ సుఖాలమీదుండే తీవ్రమైన కోరికచే ఆత్మజ్ఞానము వైపు సాగలేరు. వారికి ఆత్మస్వరూపమును యథార్థముగ తెలుసుకోవాలనిగాని, వైదిక కర్మలన్ని మోక్షైకఫలముగ ఆచరించాలనిగానీ సద్బుద్ధి ఎన్నటికీ పుట్టదు. కామ్యకర్మలు వారినట్లు ఆకర్షించివేయును. కాన ముముక్షువు అట్టి కామ్యకర్మలయందు సంగముంచుకొనరాదు.
త్రైగుణ్య విషయా వేదాః
నిస్త్రైగుణ్యో భవార్జున! |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||45
తాత్పర్యము
ఏ కొందరికోసమో కాక ప్రాణులందరకు శ్రేయస్సు కూర్చవలసినది వేదము. ప్రాణులలో కొందరు సత్వమధికముగ, కొందరు రజోగుణము, కొందరు తమోగుణమునధికముగ కలిగియుందురు. వారి వారికి కోరికలు వేరు వేరుగనుండును. అందుచే వారు నాస్తికులై చెడిపోకుండుటకై ఆయా గుణము కలవారికి ఆయా ఫలములను పొందు ఉపాయములను వేదమే తెలిపినది.నీవు సత్వగుణమధికముగ కల్గియున్నవాడవు అర్జునా! అందుచే సర్వసామాన్యమగు వేదవాక్యములలో ప్రవర్తించి మిగిలిన రెండు గుణములకు బలము చేకూరనివ్వకుము. వాటిని అణచియేయుంచుము. అట్లు అణచుటకై శారీరకముగ సంభవించు శీతోష్ణాది ద్వంద్వములను ఓర్చుకొనుము. ఓరిమి అధికమగు కొలది సత్వగుణము పెరుగుచుండును.
అదే నిలకడగ ఉండునట్లు శుద్ధసాత్త్వికుడవు కమ్ము. ఆత్మ కంటే ఇతరములగు వాటిని పొందవలెనని ఆశించకు. అయాచితముగ లభించినవాటిని రక్షించుకొనుటయందే తత్పరుడవు కానవసరం లేదు. నిరంతరము ఆత్మను అన్వేషించుటయందే అంటే, తద్విషయక ప్రసంగాదుల యందు మాత్రము లగ్నచిత్తుడవై యుండును. లేనిది పొందుట “యోగము” లభించినది కాపాడుకొనుట “క్షేమము”.
యావా నర్థ ఉదపానే
సర్వత స్సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః ||46
తాత్పర్యము
తటాకాదులలో జలరాశినిండియున్నప్పుడు ఎందరికో, ఎన్నో ప్రయోజనములకు ఆ జలము ఉపయోగించును. స్నానం కోరినవాడు ఆ ప్రయోజనానికి అవసరమైనంత జలమును ఉపయోగించుకొనును. దాహము గొన్నవాడు దానికి అవసరమైనంత జలమునే గ్రహించును. ఇట్లు అవసరమున్న వారు అవసరమైన భాగమును ఆ సరస్సునుండి గ్రహించుకొందురు. మిగిలిన జలమును తమకవసరం లేదు కనుక ఉదాసీనముగ వదలివేయుదురు.
అట్లే వేదములో ఎన్నోరకముల విషయములున్నాయి. అందరికీ అన్నీ అవసరం లేదు. వేదం చెప్పింది కదా కొన్ని మానవచ్చా అని సంశయము అవసరం లేదు. అన్నిటిలో నీకెంతవరకు అవసరమో అంత మాత్రమే గ్రహించి మిగిలినవి వదలివేయవచ్చు. నీవు చక్కటి ఆత్మజ్ఞాన నిష్ఠకలవాడవు. వేదమును విశ్వసించిన బ్రహ్మనిష్ఠుడవు. అందుచే ఆత్మప్రాప్తి కనువగు సత్వగుణమును మాత్రము పెంచు కర్మలను తెలుపు వాక్యములున్న వేదభాగమును మాత్రము స్వీకరించుము. అట్టి కర్మలనాచరించుము. మిగిలినది అనుపాదేయమని దానియందు ఉదాసీనుడవై ఉండుము.
కర్మణ్యే వాధికారస్తే
మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్భూః
మాతే సంగోఽస్త్వ కర్మణి ||47
తాత్పర్యము
హే ముముక్షో! కర్మయోగిగ నీవు ఎఱుంగవలసిన ప్రధాన సూత్రమును తెలిపెదను. నీ యోగ్యతకు తగినట్లు నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను, కామ్యకర్మలను విధివిహితముగా చేయుచునే యుండుము. నీవు సత్వగుణవృద్ధిని కోరుకొనువాడవు గాన, ఆయా కర్మలనాచరించునపుడు. వాటి వాటికి ఉండే ఏవో తాత్కాలిక ఫలములు లభిస్తున్నా, అవి నీవు కోరకుము. ఆచరించిన కర్మకు ఫలమాశించిననూ మానిననూ ఫలమనుభవింపక తప్పదు కదా యందువేమో, అవసరం లేదు.ఫలమును ఆశించినచో బంధకమగును. ఫలమును కోరకుండగ, నా ఆరాధన రూపముగ ఆచరించుట వల్ల మోక్షసాధనమగును. ఇక కర్మలు చేయుచున్నపుడు గూడ నేను చేయుచున్నాననే కర్తృత్వము నీయందారోపించుకొనకుము. ఏవో కొన్ని ఫలములు వాటంతట లభించునపుడు నా వల్లనే ఇవి లభించినవని ఫలహేతుత్వము నీయందారోపించుకొనకుము. నాకేల ఈ పీడ అని కర్మానుష్ఠానమును పూర్తిగ మానివేయకుము.
యోగస్థః కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధనంజయ! |
సిద్ధ్య సిద్ధ్యో స్సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే ||48
తాత్పర్యము
అర్జునా! రాజ్యం, ధనం, మిత్రులు, బంధువులు, వీరందరియందు మానసిక బంధమును వదులుము. బాహ్యముగ వాటిని వదలరాదు. నీ విధియగు యుద్ధము వల్ల జయాపజయములలో ఏది ఎదురైనా నిశ్చలమగు మనస్సుతో ఎదుర్కొనుము. విహితమగు కర్మలనాచరించుచు మనస్సు వికలము చెందకుండు స్థితికే యోగమని పేరు.
దూరేణ హ్యవరం కర్మ
బుద్ధియోగాత్ ధనంజయ! |
బుద్ధౌ శరణ మన్విచ్ఛ
కృపణాః ఫలహేతవః ||49
తాత్పర్యము
ఎందులకిట్లు పదే పదే తెలుపుచున్నానో తెలియునా? కర్మయోగము అనుదానిలో రెండు చేరియున్నవి. 1. చేయు పని అనగ “కర్మాంశ” 2. “జ్ఞానాంశ” అనగ ఫలమును కోరరాదనెడి జ్ఞానము. అట్లే ప్రతికర్మకును రెండు రకముల ఫలములనిచ్చు శక్తియుండును. 1. ప్రధాన ఫలము. 2. మధ్య మధ్య లభించు అవాంతర ఫలములు. ఈ అవాంతరఫలములు కోరినా కోరకున్నా లభించుచుండును. వానియందు మనస్సు పోనీయరాదు. ప్రధాన ఫలమును కోరినచో సంసారమున బంధించును. ఫలమును కోరకున్నచో నేరుగ మోక్షమునకు సాధనమగును. కనుక కర్మలనాచరించుచు ఆ కర్మలోని జ్ఞానాంశయందే (ఎలాంటి భావనతో చేయాలనే దానియందు) నిష్ఠకలవాడవు కమ్ము. అనగ సమత్వబుద్ధియందే నీవు నిలకడ కలిగి యుండుము. కర్మలు చేస్తూ ఫలములను కోరి సంసారమున పడువారు దీనులు, అవివేకులు. వారిని చూచి జాలిపడదగును.
బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృత దుష్కృతే |
తస్మా ద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలమ్ ||50
తాత్పర్యము
కర్మయోగము, నిష్కామకర్మ, యోగము అను మూడు పదములు పర్యాయపదములు. ఒకే అర్థమును బోధించును. శరీరమున్నంతవరకు తనకు విధి విహితమైన పనులను చేయుచు, ఫలమును కోరకుండుట, అట్లాచరించు సమయమున అనుకూల ఫలితములు కలిగినా, ప్రతికూలమైనవి ఎదురైనా నిశ్చలమైన మనస్సు కలిగియుండుట, కర్తవ్యమును మాత్రము మానకుండుట అని ఈ పదములకు అర్థము. అయితే కేవలము “యోగ” శబ్దమే ఈ అర్థమును తెల్పును. అది భక్తియోగమో, జ్ఞానయోగమో, అష్టాంగయోగమోనను భ్రమ కలుగకుండుటకై “కర్మయోగ”మని అందురు. కేవలము “యోగ”మను శబ్దమునకు శ్రీకృష్ణుని అభిప్రాయము ప్రకారము కర్మయోగమనే సిద్ధాంతము పై శ్లోకములో తెలియచున్నది.సమత్వబుద్ధితో కర్మలు చేయువాడు పుణ్యపాపములను రెంటినీ పట్టించుకొనక కర్మాచరణ గావించును. అర్జునా! నీవున్నూ అట్లే నీకు విహితమైన యుద్ధమనెడి యోగము నవలబించుము. ఇట్టి నిశ్చల మనస్సు కలిగియుండుట, లేదా, యోగులగుట సామాన్యులకు దుర్లభము. ఎంతో బుద్ధినైపుణ్యము కలిగినవారు మాత్రమే, పైన తెలిపిన నియమములను పాటించి నిశ్చలమనస్సును లభింతురు. (కర్మసు యోగః, కుశలబుద్ధిభిః సాధ్యః) అని అన్వయము.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.