కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధ వినిర్ముక్తాః
పదం గచ్ఛం త్యనామయమ్ ||51
తాత్పర్యము
సమత్వ బుద్ధియందు నిలచిన వివేకులు, ఆత్మజ్ఞానము కలిగియుండి తాము ఆచరించు కర్మల యొక్క ఫలములను కోరరు. కనుక ఆ కర్మలు వారిని బంధించవు. పైగా అవి వారి ప్రాచీన వాసనలను గూడ నశింపజేయును. అట్టి జ్ఞానులు నిరుపద్రవమగు మోక్షస్థానమునందుచున్నారు. ఇది ప్రసిద్ధము.
యదా తే మోహకలిలం
బుద్ధి ర్వ్యతి తరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||52
తాత్పర్యము
నిష్కామ కర్మాచరణ వల్ల “దేహమే నేను” అను అవివేకము క్రమముగ తొలగును. ఆ అవివేకమువల్లనే ఫలకాంక్ష కలుగును. అవివేకమనే మాలిన్యము తొలగి సమత్వబుద్ధి స్థిరపడగనే, యథార్థ జ్ఞానమావిర్భవించును. ఇంతవరకు వినిన క్షుద్ర ఫలముల అల్పత్వము తలచి. “అట్టివాటికై వ్యర్థప్రయాస నొందితినే” యనిపించును. ఆత్మసాక్షాత్కారలాభమును తలచి, “ఇంత గొప్పదానిని ఇంతవరకు తెలసుకొనలేకపోతినే, ఆలసించితినే” యని క్రుంగిపోదువు. నిన్ను నీవే నిందించుకొందువు.
శ్రుతి విప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధా వచలా బుద్ధిః
తదా యోగ మవాప్స్యసి ||53
తాత్పర్యము
మొదట ఆప్తులగు పెద్దలవల్ల, నీవు నానుండి వినునట్లే, వినవలెను. విన్న దానిని ఎడతెగక ప్రీతితో మననము చేయుదువు కద! ఆత్మ కంటే ఇతర విషయముల రుచులు, ఈ మననమును సాగకుండ చేయ ప్రయత్నించును. ఫలసంగ త్యాగపూర్వకముగ ఆచరించు కర్మానుష్ఠానముద్వారా మాత్రమే ఆ రుచులను అడ్డుకోగలము. ఈ మననము నశించకుండునట్లు నిశ్చలముగ మనస్సున సాగనివ్వగలము. అట్లు ఆత్మజ్ఞానమ పొందుటకు అవసరమగు సంతతస్మృతి రూపమగు అఖండ ధ్యానమును చేయనిచ్చు మనస్సుకు “సమాధి” అని పేరు.
మనస్సున కట్టి బలము నిష్కామకర్మ ద్వారా మాత్రమే లభించును. ఇప్పుడు నీ ధ్యానము మనస్సనెడి గృహమున స్థిరపడినదన్నమాట! ఇది ఆత్మ విషయకమగు యథార్థజ్ఞానము కనుక దీనిని “ప్రజ్ఞ” అందురు. అది మనస్సున స్ధిరపడినది కనుక “స్థితప్రజ్ఞ” అంటారు. అది కలవాడే స్థితప్రజ్ఞూడు. ఇట్టి స్థితప్రజ్ఞతవల్లనే అనగ మనస్సునందు చలించక నిలచిన అఖండజ్ఞానము వల్ల ఆత్మసాక్షాత్కరమనెడి “యోగ”మును పొందగలవు.
మొదట శాస్త్రశ్రవణము, దానిచేత సామాన్య తత్త్వజ్ఞానము. అపుడు నిష్కామకర్మాచరణ. దానివల్ల మనోమాలిన్య నిర్మూలనము. శరీరము అస్థిరమను జ్ఞానము, ఆత్మవిషయక యథార్థజ్ఞానముతో నిష్కామకర్మాచరణ, దానివలన శారీరక సుఖములందు ఉదాసీనత, శాశ్వతమైన ఆత్మానందమందు శ్రద్ధ, అపుడు సంతత స్మరణ రూపధ్యానము లేక ఉపాసన. దీనినే స్థితప్రజ్ఞత, జ్ఞాననిష్ఠ లేక జ్ఞానయోగము అని అందురు. ఆ రకమైన నిరంతర ధ్యానము వల్ల ఆత్మసాక్షాత్కారము కలుగును. ఇదీ క్రమము.
సమత్వబుద్ధితో చేయు కర్మకూ “యోగ”మని పేరు. దానివల్ల కలిగే ఫలము ఆత్మసాక్షాత్కారము. దానికీ యోగమనే పేరు. మొదటిది సాధనమైన యోగము. రెండవది ఫలరూపమైనన యోగము.
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా?
సమాధిస్థస్య కేశవ! |
స్థితధీః కిం ప్రభాషేత?
కి మాసీత? వ్రజేత కిమ్? ||54
తాత్పర్యము
మనస్సు స్వాధీనమునందుండవలెనన్న ఇంద్రియములు చెప్పినమాట వినవలెను. అవి గుఱ్ఱములవంటివి. వాటి ప్రవృత్తి తప్పుదారి పడితే నేను సరిచేయజాలకున్నాను. గుఱ్ఱమువలె వచ్చిన “కేశి” అను అశ్వాసురుని సంహరించి “నా భక్తుల ఇంద్రియములను నియమించువాడను నేనే” అని నిరూపించుకొన్న కేశిహన్తా! శ్రీకృష్ణా! ఇంద్రియజయముతో మనస్సును స్వాధీనపరచుకొన్న స్థితప్రజ్ఞుని స్వరూపమెట్లుండును? వానిని తెలుపు శబ్దమేది? అట్టి యోగి యొక్క వాచిక, కాయిక, మానసిక ప్రవృత్తులు ఎట్లుండునో వివరించుమా!
శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్థ! మనోగతాన్ |
ఆత్మన్యే వాత్మనా తృప్తః
స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే ||55
తాత్పర్యము
మనస్సులో పేరుకున్న రుచులు, వాసనలూ, బయటి వస్తువుల పై ఇష్టానిష్టాలను కలిగిస్తాయి. ఈ ఇష్టానిష్టాలే అన్ని రకాల కోరికలకూ మూలము. కోరికలు తగ్గలాంటే రుచి, వాసనలను మనస్సులోంచి తొలగించి సమత్వబుద్ధి ద్వారా శుద్ధాత్మజ్ఞానాన్ని మనస్సులో నింపితే దానిలో రుచులు, వాసనలూ క్రమంగ తొలగుతాయి. అప్పుడాతనికి ఆత్మయందే తృప్తికలుగును. బాహ్యముగ విషయములన్ని చుట్టుముట్టి ఉన్ననూ అవి వానికి భోగ్యవస్తువులుగ అనిపించవు. ఆత్మయే భోగ్యముగ గోచరించును. ఆతడు స్థితప్రజ్ఞుడు.
ఆత్మ సాక్షాత్కారానికి పరిపూర్ణముగ యోగ్యుడు. దీనిని వశీకారావస్థ అందురు. మనస్సులోని ఆత్మజ్ఞానముతో బుద్ధిచేరి, నిలచిపోయినది. దీనికి దృష్టాంతము శ్రీ శుక యోగీంద్రుడు.
దుఃఖే ష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగత స్పృహః |
వీతరాగ భయక్రోధః
స్థితధీ ర్ముని రుచ్యతే ||56
తాత్పర్యము
దుఃఖమునకు రెండు కారణములు. శరీరానికి ఇష్టమైనది దూరమగుట, ఇష్టములేని వస్తువు దరిజేరుట. ఇట్లు దుఃఖకారణములగు వస్తువు లెదురైనప్పుడు మనస్సు చలించి భయము కలుగును. దాని వల్ల దుఃఖం.
అట్లే సుఖమునకూ రెండు కారణములు. శరీరానికి ఇష్టమైనది దరిజేరుట, అనిష్ట వస్తువు దూరమగుట. ఇట్లు సుఖకారణములగు వస్తువులు ఎదురైనపుడు కూడా మనస్సులో ఆసక్తి పెరిగి సంతోషము కలుగును. దానివల్ల సుఖము.
ఇట్టి సుఖదుఃఖములకు కారణము ఆత్మజ్ఞానము లేకపోవుట. దేహము పై ప్రేమ అధికముగ ఉండుట. ఆ ప్రేమకే “రాగ”మని పేరు.
అట్టి దేహమున కేమి చేయునో అని ఎదుటి వ్యక్తిని అనుమానించి పొందెడి మనోవికారమే “భయము”.
తన భయానికి కారణమైన ఎదుటివ్యక్తికి ఏదో చేసి దుఖమును కల్గించవలెనను ప్రతీకారబుద్ధితో పొందిన మనోవికారమే “క్రోధము”.
రాగ, భయ క్రోధములకు మూలము దేహము పై ఏర్పడ్డ ప్రేమ. అది వదలి ఆత్మనే ధ్యానించు వాడు “ముని”. ఆత్మజ్ఞానము అధికము అయ్యేకొద్దీ ఆతనికి రాగ, భయ, క్రోధములు వాటంతట అవియే వదలిపోవును. అతడు ఆత్మజ్ఞాననిష్ఠుడై “స్థితప్రజ్ఞుడ”ని పిలువబడును. ఇతడు కూడ ఆత్మసాక్షాత్కారానికి పూర్ణయోగ్యుడు.
ఇది ఏకేంద్రియావస్థ. మనస్సులోని ఆత్మజ్ఞానాన్ని బుద్ధి గుర్తించింది. దానితో కలసి నిలకడగా ఉండే ప్రయత్నం చేస్తున్నదని గుర్తించాలి. దీనికి దృష్టాంతము జడభరతుడు.
య స్సర్వ త్రానభిస్నేహః
తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||57
తాత్పర్యము
ఇష్టవస్తువు లభిస్తే సంతోషించి పొగడుట. అనిష్ట వస్తువు లభిస్తే దుఃఖంతో ద్వేషించుట చూస్తూ ఉంటాము. పొగడుట, “తిరిగి అట్టిది కావాలని” తెలుపుటకే గద, అట్లే, ద్వేషించుట “అట్టిది ఇక వద్దని” తెలుపుటకూ సూచనలు. శరీరమునందు దృష్టి కలవానికి ఆయా వస్తువుల అనుభవము నందుండు మానసికమైన పట్టు, అట్లు పొగడునట్లో, ద్వేషించునట్లో చేయును. శరీర సుఖాన్నే తలచే మనస్సులో ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని నింపేకొద్దీ బాహ్యవస్తువుల రుచులు మనస్సులోంచి క్రమంగ దూరమవుతాయి.
ఇంద్రియాలు వస్తువుల స్పర్శను పొందుతున్నా, బుద్ధి యొక్క ప్రేరణతో, మనస్సు, ఆయా స్పర్శలను ఇష్టమైనా, అనిష్టమైనా సహించగలిగితే ఆ మనస్సులోని ప్రాచీనవాసనలు క్రమంగ దూరమౌతుంటాయి. ఇతడున్నూ ఆత్మసాక్షాత్కారమునకు తగిన జ్ఞానమున్నవాడే.
ఇది వ్యతిరేకావస్థ. మనస్సులోని ఇతరవాసనలను ఆత్మజ్ఞానమును నింపుతూ క్రమంగ తొలగించేపనిని బుద్ధి చేస్తున్నదని గుర్తించాలి. దీనికి దృష్టాంతము జనకమహారాజు.
యదా సంహరతే చాయం
కూర్మోఽఙ్గానీవ సర్వశః |
ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||58
తాత్పర్యము
ప్రమాదమేర్పడునని భావించినపుడు తన అవయవమున్నింటిని తాబేలు లోనికి ముడుచుకొని సురక్షితముగ నుండును. ప్రమాదము దాటగనే తిరిగి సంచరించ నారంభించును.
అట్లే ఆత్మజ్ఞానమును నశింపచేయు విషయములెదురైనపుడు ఆయా విషయములనుండి తన ఇంద్రియములను వెనుకకు మరలించుకొనువానికి క్రమముగ, ఆత్మజ్ఞానము స్థిరమై నిలచును. ఆతడున్నూ స్థితప్రజ్ఞుడే.
ఇది యతమానావస్థ. మనస్సులో శారీరకరుచులే నిండిఉన్నాయి. సంస్కారం కల బుద్ధిని మనస్సులోనింపే ప్రయత్నం చేస్తున్నాడు. విషయాలను చూడగానే మనస్సు పరిగెడుతుంది. బుద్ధి, దానిని బలవంతంగ వెనక్కిలాగి ఆత్మజ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది మొదటి దశ. దీనికి దృష్టాంతము విశ్వామిత్రుడు.
ఇవి నాలుగు స్థిత ప్రజ్ఞావస్థ యొక్క వివిధ దశలు. వీటిలో ఉండే తేడాలు సూక్ష్మమైనవి. క్రిందనుండి చూస్తే, మొదటి దశలో కామములయందు రుచి ఉంటుంది. కావాలనే పొందుతూ ఉంటాడు కాని మనస్సును వాటినుండి వెనుకకు మరల్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనస్సులో ఆత్మజ్ఞానాన్ని నింపాలనే ప్రయత్నం ప్రారంభమైనదన్నమాట.
రెండవదశలోనూ కామములను పొందుతూ ఉంటాడు కాని కావాలని కోరడు. వద్దని మానడు. సుఖదుఃఖాలు రెండిటిని మనస్సులోనే సహిస్తూ అణచి ఉంచుతాడు. బయటకేమీ తెలుపడు. మనస్సుకి మాత్రం భయం బాధ లేక సంతోషాలు కలుగుతుంటాయి. మనస్సులో ఆత్మజ్ఞానం కొంత పొందినా, రుచి వాసనలు తమ బలం చూపుతునే ఉన్నాయన్నమాట.
మూడవదశలో కూడా కామములుంటాయి. అవి సుఖాన్నో దుఃఖాన్నో కల్గిస్తూనే ఉంటాయి. కాని అవి నాకు కాదనుకొని పట్టింపు లేకుండా మనస్సులో గుడ వాటితో సంబంధం లేకనే ఉంటాడు. అయితే అవి కామములనే జ్ఞానము మాత్రం ఉంటుంది. మనోవికారాలు మాత్రం కలుగవు. రుచివాసనలు చాలవరకు తగ్గాయి. బుద్ధిబలం పెరిగిందన్నమాట.
ఇక నాల్గవదైన చివరి దశలో బుద్ధి ప్రభావంతో ఆత్మజ్ఞానం మనస్సులో స్థిరపడింది. కనుక చుట్టూ అనేక కామ జనకములగు వస్తువులున్నా అసలవి కామములగనే కనిపించవు. అన్నిటిలో ఆత్మ తప్ప మరొకటేమీ వానికి గోచరించదు. ఇక్కడికి రుచివాసనలు చాలవరకు పోయినట్లే. ఆత్మజ్ఞానం నిండినట్లే.
విషయా వినివర్తంతే
నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే ||59
తాత్పర్యము
మనస్సున నిండియున్న రుచులు ఇంద్రియములను విషయానుభవము వైపు ప్రేరేపించును. ఆత్మ సాక్షాత్కారము కోరి ఇంద్రియములకు ఆయా విషయములనీయక శుష్కింపజేయుచు ఇంద్రియజయమునకై ప్రయత్నింతురు. కేవలము అంతమాత్రమే చాలదు. నిరాహారముగ ఇంద్రియముల నుంచుట వల్ల బయటి విషయములైతే దూరమైనవి గాని, వాటి యొక్క రుచులు మనస్సులోనే యుండును. అవి తొలగవు.
తొలగవలెనన్నచో, వీటి కంటే మించిన ఆనందము నొసంగు ఆత్మతత్త్వమును దర్శింపజేయవలెను. ఆత్మ దర్శనమగువరకూ ఈ రుచులు అట్లే మనస్సులో ఉండి, ఆత్మదర్శనమైతేనే ఇవి తొలగును. విషయానుభవము మానగనే ఆత్మదర్శనము కాదు. విషయానురాగము కూడ తొలగిననే ఆత్మ సాక్షాత్కారమగును.
యతతో హ్యపి కౌంతేయ!
పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి ప్రసభం మనః ||60
తాత్పర్యము
శాస్త్రము ద్వారా ఏది వదలదగునో, ఏది స్వీకరించదగునో స్పష్టముగ గుర్తించి, ఆత్మసాక్షాత్కారమే పొందదగినదను నిశ్చయముతో దాని కొరకై నిష్కామ కర్మ నాచరించు ప్రయత్నశీలుడగు పురుషుని గూడ, ఇంద్రియములు కలచివేసి, హింసించి స్వాధీనపరచుకోగలవు సుమా!
శబ్దాది విషయములందలి రుచులు మనస్సులోనున్నంత వరకు ఇంద్రియములను జయించుట ఎవ్వరికీ శక్యముగాదు. నీటిలో నున్న మొసళ్ళ వలె, రుచులు మరగిన ఇంద్రియములు బలిష్ఠములై, ఆత్మ వైపు ప్రవర్తించు మనస్సును ఒక్క ఉదుటున విషయసుఖములలోనికి లాగి ముంచి పారవేయును.
అందుచేతనే ఇంద్రియజయమునకై ఆయా శబ్దాది విషయములను ఇంద్రియాలకు దూరం చేయుడంతోపాటు , మనస్సున నిండియున్న విషయానురాగమును తొలగించుటయే ప్రధానము. అప్పుడే ఇంద్రియములు ఉద్రేకము తగ్గి మనస్సు చెప్పినట్లు వినును. ఇంద్రియజయము వల్ల మనస్సులో స్థిరబుద్ధి కలిగి ఆత్మ సాక్షాత్కారమునందగలుగును. అర్థాత్, విషయానురాగము తగ్గితే గానీ, ఇంద్రియజయం కలుగదు. ఇంద్రియ జయము కలిగితే గాని ఆత్మ సాక్షాత్కారంగాదు. ఆత్మ సాక్షాత్కారమైతేగాని విషయరాగం తగ్గదు.
ఇట్లు ఒకదానికొకటి కారణమై ఏది ముందు, ఏది తర్వాత అను ప్రశ్న ఏర్పడును. అన్యోన్యాశ్రయణమువల్ల ఆత్మ సాక్షాత్కారంగాని, ఇంద్రియజయం కానీ రెండూ దుర్లభమేని సారాంశము.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.
ఈ భగవద్గీత పద్యాలు, తాత్పర్యాలు సేకరణ మాత్రమే ఈ బ్లాగ్ లో ఎక్కడన్నా తప్పులుండటం సహజం . తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు. ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతుల లక్షణం . తప్పులు చెబితే సరిదిద్దుతాము.