కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-61 to 72

తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||61

తాత్పర్యము
ఇంద్రియ జయమువల్ల స్థితప్రజ్ఞత, స్థిత ప్రజ్ఞత వల్లనే ఇంద్రియజయము. ఇట్లు అన్యోన్యాశ్రయముచే మనస్సు దేనినీ సాధింపలేక పోవును. కనుక మనస్సు స్వాధీనపడుటకు మరొక సులభోపాయమును తెలిపెదను.
ఇంద్రియానుభవము కంటే గొప్పది చూపిననే కద, మనస్సులో నిండిఉన్న విషయరాగం పోవును?. అట్టి గొప్పదగు ఆత్మను నీవు చూపలేవు. కావున, ఆత్మకంటే గొప్పవాడను, దివ్యుడను, ఆశ్రయించుటకు సులభుడను, (విగ్రహరూపంలో) మనోహరుడను అనగా శుభాశ్రయుడను,సత్వమహితుడను అగునన్ను చూపుము. ఇంద్రియములను శుష్కింప చేయుట ద్వారా వాటిని జయింపవలెనని కోరకుము. వాటిని నావైపు ప్రవర్తించునట్లు, నా సంబంధము పొందుటకు తగినట్లు నియమించి, నడిపించుము.
విషయరాగంతో బలపడ్డ ఇంద్రియాలు నా పరము కాగానే, వాటిలో నిండిన రజో తమో గుణములను, వాటివల్ల ఏర్పడ్డ దోషములను నేను దహించి వేసెదను. సత్వస్వరూపుడనగు నేను, నీ మనస్సునందు సత్వగుణమే నిండునట్లు చేసెదను. రజోగుణము తమోగుణమూ నశించగనే వానివల్ల ఏర్పడు విషయరాగము దానంతట అదియో తొలగిపోవును గద! అపుడు సత్వము నిండిన మనస్సు యొక్క స్వాధీనములోనికి ఇంద్రియములు చేరును. ఇట్లు ఇంద్రియ జయము కలుగగనే ఆత్మజ్ఞాన నిష్ఠ నెలకొనును. శభాశ్రయుడనగు నన్నాశ్రయించిన వానికే ఆత్మసాక్షాత్కార మవసరము లేకనే ఇంద్రియజయము సిద్ధించును. అతడే స్థితప్రజ్ఞుడు కాగలుగును.

ధ్యాయతో విషయాన్ పుంసః
సంగ స్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః
కామాత్ క్రోధోఽభిజాయతే ||62
తాత్పర్యము
నా పరముగ ఇంద్రియములను కూర్చక, ఎవడైనా తన ప్రయత్నము చేతనే ఇంద్రియ జయమును, తద్వారా ఆత్మ సాక్షాత్కారమును సాధించదలచినచో ఎంత అనర్ధము దాపురించునో తెలియునా?
మనస్సు విషయరాగముతో నిండియుండును. వీడు బుద్ధిమంతుడై ఆత్మావలోకనకై యత్నించుచున్నను మనస్సు మాత్రము విషయములనే తలపించును. ఆ విషయములందే అధికమగు అనురాగమేర్పడును. ఇది “సంగము”.
ఇది పక్వమై ఆయా విషయములను పొందనిదే జీవించలేననిపించును. ఇది “కామము”.

క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః |
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||63

తాత్పర్యము
కామము తీరనిచో కనిపించిన వారందరూ తన కాటంకము కల్గించిరని భ్రమించి, అడ్డు తగిలినవారి పై విరచుకు పడునట్లు చేయును. ఇది క్రోధము. క్రోధము పెరిగేకొద్దీ మంచి చెడులకు తేడా మరచి, దేహమే తానను అవివేకమున బడును. ఇది “సమ్మోహము”.
సమ్మోహము వల్ల సాధించ ప్రారంభించిన ఆత్మజ్ఞానము, ఇంద్రియ జయమును, నిష్కామ కర్మలను మరచును. ఇది “స్మృతివిభ్రమము”.
ఇట్టి మతిమరుపు వల్ల వ్యవసాయాత్మిక బుద్ధి చెదిరిపోవును. ఇది “బుద్ధినాశము”.ఇక ఆత్మజ్ఞానమునకు తావేది? దేహాత్మ భ్రాంతితో తిరిగి సంసారమునపడి ఆత్మనే మరచిపోవును.

రాగద్వేష వియుక్తైస్తు
విషయా నింద్రియై శ్చరన్ |
ఆత్మవశ్యై ర్విధేయాత్మా
ప్రసాద మధిగచ్ఛతి ||64

తాత్పర్యము
స్వప్రయత్నముతోటే సాధిస్తానని అహంకరించక, శుభాశ్రయుడను, సర్వేశ్వరుడను అగు నాయందు ఇంద్రియ ప్రవృత్తులను లగ్నము చేసినచో, ఇంద్రియ ప్రవృత్తులను పాడుచేయు పాపవాసనలకు ఆధారములగు రాగము, ద్వేషములను నేను తొలగింతును.
అపుడింద్రియములు నీ వశములగును. మనస్సు నీవు చెప్పినట్లు ప్రవర్తించును. విషయములు, ఇంద్రియముల ఎదుటబడిననూ, స్వాధీనమైన మనస్సు కలవాడవు అగుటచే వాటికి లొంగక, తిరస్కరించి ప్రవర్తించ గలవు. అపుడు నీవు నిర్మలమైన అంతఃకరణము కలవాడవు అగుచున్నావు. అట్టి మనోనైర్మల్యమునకే “మనః ప్రసాద” మని పేరు.

ప్రసాదే సర్వదుఃఖానాం
హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధిః పర్యవతిష్ఠతే ||65

తాత్పర్యము
ఆత్మజ్ఞానము ఏకధారగ సాగి ఆత్మసాక్షాత్కారమగుటకు ఆటంకములగు విషయరాగములు, వాటికి మూలమగు రజోగుణ, తమోగుణములు మొదలగు దుఃఖకారణములన్ని నా సంబంధము వలన ఏర్పడిన మనోనైర్మల్యముతో నశించిపోవును. అట్టి నిర్మలాంతఃకరణము, అంటే, మనఃప్రసాదము గల సాధకునికి అట్టి మనస్సునందే ఆత్మనుగురించిన బుద్ధి స్థిరబడి స్థిత ప్రజ్ఞత ఏర్పడి, అతి శీఘ్రముగనే ఆత్మ యొక్క సహజస్వరూపము సాక్షాత్కరించును.

నాస్తి బుద్ధి రయుక్తస్య
న చా యుక్తస్య భావనా |
న చా భావయత శ్శాంతిః
అశాంతస్య కుత స్సుఖమ్ ||66

తాత్పర్యము
మనస్సును, సర్వసులభుడను, సర్వేశ్వరుడనగు నా యందు నిలుపనివానికి ఆత్మవిషయక జ్ఞానమే కలుగదు. ఆత్మజ్ఞానమే కలుగని వానికి ఆత్మధ్యానము సిద్ధించదు. సంతతము ఆత్మ మననము చేయనివానికి విషయవాంఛలు తగ్గవు. ఇంద్రియోద్రేకము శాంతించదు. ఇంద్రియశాంతి లేనివానికి సుఖమెక్కడిది? నిరతిశయానందము ఎట్లు లభించును?

ఇంద్రియాణాం హి చరతాం
య న్మనోఽను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం
వాయు ర్నావ మివాంభసి ||67

తాత్పర్యము
ప్రకృతిలో జీవించు సాధకుని ఇంద్రియములు ప్రకృతియందలి శబ్దాదివిషయములను అనుభవించకుండ ఉండలేవు గద! ఇంద్రియములకు ఆయా విషయముల నందించునపుడు మత్పరము చేయమని గద ఉపదేశించితిని. అనగ భగవత్సేవకైయ్యే ఆయా విషయములు ఇంద్రియములకు అందుచున్నవి గనుక వాటి ఫలితములతో నాకేమీ సంబంధము లేదు అని మనస్సులో దృఢమైన విశ్వాసముండవలెను. అపుడు ఇంద్రియములు విషయాలతోనున్నా, మనస్సు లో నేనున్నాను. కనుక నా ప్రభావముచే ఆ విషయములు నిన్నేమీ చేయవు. మనస్సు తనలోని స్థితప్రజ్ఞత వల్ల ఆత్మసాక్షాత్కారమునకు తోడ్పడును.
అట్లు గాక, విషయాలనే అనుభవించు ఇంద్రియములను స్వాధీనం చేసుకుందామని వాటి ఆలోచనే మనసులో నింపితే ఆ మనసులోని ఆత్మధ్యానము పోతుంది. చుక్కాని లేని నావ నీటి ప్రవాహనికి అనుకూలంగనో, గాలివాటుకు తగినట్లో పోయి గమ్యము తప్పినట్లే, స్వాధీనంలేని మనస్సు విషయములందే నిన్ను ముంచును. గమ్యమునుండి భ్రష్టమై విషయసుఖమలనే నీటి ప్రవాహములో , ఇంద్రియానుభవమనే గాలితో మనస్సనే నావ బలాత్కారముగ కొట్టుకొనిపోయి ఆత్మానందమనెడి గమ్యము భ్రష్టమై, ఈ సాధకుణ్ణి, సంసారమును ముంచును.

తస్మా ద్యస్య మహాబాహో!
నిగృహీతాని సర్వశః |
ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||68

తాత్పర్యము
కావున నీ మనస్సు యొక్క చుక్కానిని నేర్పరినగు నా చేతిలో నుంచుము. నావను గమ్యమునకు చేర్చెదను. “నేను భుజబలముతో ఇంద్రియములను అణచలేనా?” అనుకొనుచున్నావా, మహాబాహో! అర్జునా! ఎంత భుజబల సంపన్నుడైననూ ఇంద్రియముల బలము ముందు నీవు చిత్తు కావలసిందే. నా యందు భారముంచి విషయములనుండి పూర్తిగ ఇంద్రియములను నియమించువానికి మాత్రమే స్థితప్రజ్ఞత స్థిరపడును.

యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునేః ||69

తాత్పర్యము
సమస్త ప్రాణులకు ఆత్మవిషయకబుద్ధి, రాత్రివలె, ప్రకాశించక యుండును. కాని స్థితప్రజ్ఞుడు ఆ ఆత్మవిషయక బుద్ధియందు జాగరూకుడై యుండును. ఇంద్రియానుభవములకు సంబంధించిన బుద్ధి ,ప్రాణులందరిలో, పగటివలె, ప్రకాశించుచుండును. కాని ఆత్మ మననశీలునకు ఆ ఇంద్రియ సుఖ విషయము రాత్రి వలె ప్రకాశించదు.

ఆపూర్యమాణం అచలప్రతిష్ఠం
సముద్ర మాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ ||70

తాత్పర్యము
సముద్రము ఎప్పుడూ అన్ని వైపులా సహజముగ నీటితో నిండి ఉండును. ఎన్నో నదులు సతతము అందులో చేరుచునే యుండును. ఆ చేరెడి నదీజలములతో సముద్రం పొంగిపోయి గట్లను మీరుట లేదే. క్రొత్త నీరు రావాలని కోరుట లేదు. వచ్చునీటిని ఆపుట లేదు. చేరనిచో క్రుంగిపోవుట లేదు. చేరినంత మాత్రాన పొంగిపోవుట లేదు. తన హద్దు మీరక గంభీరముగనే సదా ఉండును.
అట్లే బుద్ధిమంతుడగు ఆత్మ మననశీలుడు ఎన్ని విషయములు తనలో ప్రవేశించుచున్ననూ అవి కావాలని కోరక, చేరినవాటిని నిందించక, వాటివల్ల పొంగు క్రుంగులు లేక, ఆత్మనిష్ఠ వదలకుండగ నిర్వికారముగ ఉండును. అట్లుండు వాని మనస్సు నిర్మలమై స్థితప్రజ్ఞత సిద్ధించును. వాడే శాంతి నొందును తప్ప కామోపభోగములనే వాంఛించువాడు శాంతమనస్కుడు కాలేడు. ఇది “వ్యతిరేకావస్థ”యని గద తెలుసుకుంటిమి!

విహాయ కామాన్ య స్సర్వాన్
పుమాంశ్చరతి నిస్పృహః |
నిర్మమో నిరహంకారః
స శాంతి మధిగచ్ఛతి ||71

తాత్పర్యము
అహం అనగ ఆత్మ లేక జీవుడు. దేహము మరియు ఆత్మ వేరని తెలియక “దేహమే నేన” నుకొనుట అహంకారము. ఇది అజ్ఞానముచే కలుగును. అట్టి దేహానికి చెందిన వస్తువులను, వ్యక్తులను నా వారు అని భ్రమించుట మమకారము. దేహానికి కావలసినవన్ని కూర్చి పెట్టవలెను అను విషయవాంఛనే స్పృహ అందురు. ఈ స్పృహ వల్ల విషయాసక్తుడై, విషయసంపాదన ప్రారంభించును. లభిస్తే సంతోషం, విఫలమైతే మనఃక్షోభ. రెంటి వల్ల తృప్తితీరక తిరిగి సంపాదనేచ్ఛ, ఇంద్రియప్రవృత్తి ప్రారంభమగును. దానివల్ల మరింత అజ్ఞానం, దానివల్ల మనస్సు మలినమగుట. దానిచే అశాంతి, తిరిగి అహంకారము.

ఇట్లు తిరుగు ఈ చక్రానికి మూలము దేహాత్మభ్రాంతి. ఇది తొలగవలెను. సర్వవిషయములందలి కోరిక సవాసనగ వీడి, దేహాత్మ వివేకముచే, ఆశారహితుడై, తద్ద్వారా అహంకార, మమకారములు తొలగినవాడై, లభించిన విషయములతో నా యందు భారముంచి వీతరాగుడై సంచరించువాడే స్థితప్రజ్ఞుడై శాంతమనస్కుడగుచున్నాడు. ఇది “ఏకేంద్రియావస్థ” కద!

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ!
నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాఽస్యా మంతకాలేఽపి
బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ||72

తాత్పర్యము
ఆత్మలు దేహము కంటే వేరు, నిత్యమైనవి అను విశ్వాసముతో తత్సాక్షాత్కారమే లక్ష్యముగ కలిగి, దానికై భగవత్పరముగ ఫలసంగము విడచి కర్మలనాచరించవలెను. అట్లు నిశ్చలమై శాంతించిన మానసిక స్థితినే “బ్రాహ్మీస్థితి” అందురు.”బ్రహ్మ”పదమునుకు “ఆత్మ” అని అర్థం. దానికి సంబంధించిన స్థితి కనుక బ్రాహ్మీస్థితి. ఇది లభించినవాడు ఇక రజఃప్రభావము నిండిన సంసారమున దేహాత్మభ్రాంతితో కూరుకొనడు.
మొదటినుండి ఇట్టి జ్ఞానములేకున్ననూ, కనీసము చరమదశలోనైనా విషయ విరక్తి కలిగి గడచిన దానికి పశ్చాత్తప్తుడైనచో, అప్పుడైనా ఈ కర్మయోగమునందు ప్రవేశించి ఆత్మానందము పొందగలుగును.ఇక చిన్న వయస్సు నుండి ఆ కర్మయోగ స్థితిలోనున్న వాని విషయమేమి చెప్పవలెను. అర్జునా! శోకము మాని, నీవునూ శాంతమనస్కుడవై కర్తవ్యోన్ముఖుడవు కమ్ము. నాపై భారముంచుము. కర్తవ్యపాలనలో బంధువధాదులు ఎదురైనా నీవేమీ వెనుదీయనవసరం లేదు. యుద్ధము చేయుము.

ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

ఈ భగవద్గీత పద్యాలు, తాత్పర్యాలు సేకరణ మాత్రమే ఈ బ్లాగ్ లో ఎక్కడన్నా తప్పులుండటం సహజం . తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు. ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతుల లక్షణం . తప్పులు చెబితే సరిదిద్దుతాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *