శ్రీ భగవానువాచ:
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1
శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను.
జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2
బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ వుండదు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 3
ఎన్నో వేలమందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు.
భూమిరాపో௨నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || 4
నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || 5
అర్జునా! ఇప్పుడు చెప్పింది అపరప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో.
ఏతద్యోనీని భుతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || 6
నా ఈ రెండు ప్రకృతులనుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తూ ఆవిర్భవించడానికీ, అంతం కావడానికీ కారణం నేనే.
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || 7
ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను.
రసో௨హమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 8
కౌంతేయా! నేనే నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నరులలో పురుషకారంగా వున్నాను.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 9
నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || 10
పార్థా ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధీ, తేజోవంతులలోని తేజస్సూ నేనే.
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామో௨స్మి భరతర్షభ || 11
బలవంతులలోని ఆశ, అనురాగం లేని బలాన్ని నేను. ప్రాణులలోని ధర్మవిరుద్ధం కాని కామాన్నీ నేనే.
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి || 12
సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను; నాలో అవి వున్నాయి.
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ || 13
ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || 14
త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || 15
పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలోపడి వివేకం కోల్పోయినవాళ్ళు, రాక్షసభావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు.
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో௨ర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || 16
అర్జునా ! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు—ఆపదలో వున్నవాడు, ఆత్మతత్త్వం తెలుసుకో గోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు.
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినో௨త్యర్థమహం స చ మమ ప్రియః || 17
ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేనూ, నాకు అతనూ ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం.
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ || 18
వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || 19
అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు.
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా || 20
తమ తమ పూర్వ జన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను, వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు.
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 21
ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను.
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ || 22
అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు.
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 23
మందబుద్ధులైన ఈ మానవులు పొందే ఫలితాలు అశాశ్వతాలు. దేవతలను అర్చించేవాళ్ళు దేవతలనే పొందుతారు; నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 24
అవివేకులు శాశ్వతం, సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవమాత్రుడిగా తలుస్తారు.
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢో௨యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 25
యోగమాయచేత కప్పబడివున్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది.
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 26
అర్జునా ! భూతభవిష్యద్వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరు నాకు తెలుసు. అయితే నేను ఏ ఒక్కడికీ తెలియను.
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప || 27
పరంతపా ! సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగ ద్వేషాలమూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 28
పుణ్యకర్మలు చేసి సకలపాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖరూపమైన మోహాలనుంచి విముక్తులై గట్టిపట్టుదలతో నన్ను భజిస్తారు.
జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ || 29
ముసలితనం, మృత్యువులనుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించేవాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మస్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలుగుతారు.
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలే௨పి చ మాం తే విదుర్యుక్తచేతసః || 30
అధిభూతమూ, అధిదైవమూ, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలిసినవాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరచిపోరు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని “జ్ఞాన విజ్ఞాన యోగము” అనే ఏడవ అధ్యాయం సమాప్తం.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది.
భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే.
భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి.
ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.
ఈ భగవద్గీత ఇప్పటిది కాదు ఈ పద్యాలు, తాత్పర్యాలు సేకరణ మాత్రమే.
ఎక్కడన్నా తప్పులుండటం సహజం.
తప్పులెన్నడం మనిషి లక్షణం కాదు.
ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం వివేకవంతుల లక్షణం.
తప్పులు చెబితే సరిదిద్దుతాము.