శ్రీ రుక్మిణీ ,సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ స్థల మహత్యం
పెనుగంచిప్రోలు గ్రామం, ఎన్టీఆర్ (కృష్ణా) జిల్లా
మన పెనుగంచిప్రోలు గ్రామం అతి పురాతన కాలం నుండి అనేక దేవాలయాలతో,ఉత్తమ సంస్కారం కలిగిన బ్రాహ్మణోత్తములతో,అంతే కాకుండా వారి వారి ప్రతిభలతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అన్ని జాతుల, మతముల వారితో విరాజిల్లుతున్నది. ఇది విదేశీ దండయాత్రలతో వినాశనాన్ని పొంది మరల తిరగగట్టిన గుర్తులుగా గ్రామపు మధ్య బొడ్రాళ్ళు సాక్ష్యముగా నిలుస్తాయి. దీనికి పెద్దకాంచీపురం అని పేరు ఉండేదని నానుడి. అప్పట్లో ఇక్కడ 108 ఆంజనేయస్వామి దేవాలయములు కలవని ప్రసిద్ధి. ఇప్పటికీ ఎక్కడ తవ్వినా దేవాలయ అవశేషాలు, నందీశ్వరులు లభించడమే ఇందుకు నిదర్శనము.
అతి పురాతనమైన దేవాలయములలో ఒకటిగా ప్రసిద్ధి కెక్కిన దేవాలయములలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము కూడా ఒకటి. శ్రీ కాకాని గోపయ్య స్వామి వారి తల్లి తండ్రులు కూడా ఈ దేవాలయములో పూజ లు కావించి సంతానప్రాప్తిని పొందారని, ఆ బిడ్డకు గోపయ్య అని నామకరణం చేసినారు అని కధనము. అందుకే స్వామి వారికి సంతాన వేణుగోపాలస్వామి అనే మరిఒక నామం కలదు. ఈ ఆలయమునకు గరుత్మంతుడు క్షేత్రపాలకుడై ఉన్నాడు.
ఈ దేవాలయ చరిత్ర విషయానికి వస్తే పెనుగంచిప్రోలు గ్రామ పెద్దకరణం గా పని చేసిన శ్రీ కొమరగిరి వేంకట అప్పారావు గారి ముత్తాతగారికి ఈ విగ్రహములు మునేటిలో దొరికినాయని, వాటిని ఆయన ప్రస్తుత దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టించారని పూర్వీకుల ద్వారా తెలిసిన విషయములు. తదనంతరం శ్రీ అప్పారావు గారి తండ్రిగారు అయిన శ్రీ లక్ష్మీకాంతరావు గారు, మరియు చిన్నతండ్రిగారు అయిన శ్రీ వేంకట నరసింహారావు తమ స్వంత గృహ నిర్మాణం గావించుటకై పెద్దలను సంప్రదించగా, గృహ నిర్మాణమునకు ముందు ఏదైనా ఒక జీర్ణాలయోద్ధరణ చేసి గృహ నిర్మాణం చేస్తే మంచిది అని ఇచ్చిన పెద్దల సలహాను పాటించి, వాళ్ళ నాన్నగారి హయాంలో నిర్మించిన ఈ వేణుగోపాలస్వామి వారి దేవాలయాన్ని పునరుద్ధరించి విమాన గోపురం, అంతరాలయమండపం, తిరుమండపాదులను నిర్మించి, జీవ ధ్వజ ప్రతిష్ట, ఏడు గుర్రాలు కలిగిన సూర్యభగవానుని ఏకశిలా పాణిపట్టం పైన విగ్రహాలను,
శ్రీ పరాంకుశం సాలగ్రామ నరసింహాచార్యుల వారి ఆశీస్సులు, ఆధ్వర్యంలో పునఃప్రతిష్ట కావించినారు.
స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యములకు, ఆలయ అర్చకుల సంరక్షణార్థం సుమారు 25 ఎకరాల పొలాన్ని స్వామివారి పేర రాసి ఇచ్చినారు.
ఆ తరువాత కాలం లో మూలవిరాట్టుల ఉత్సవ విగ్రహములకు తోడు గోదాదేవి ఉత్సవ విగ్రహములను తయారుచేయించినారు. కొండపల్లి నుంచి లక్కఅశ్వవాహన,హనుమంతవాహనములను తయారుచేయించి ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు వైఖానసాగమ సాంప్రదాయ ప్రకారం ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం మరియు కొమరగిరి వారి ఇంటినుండి పసుపు, కుంకుమ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు మరియు మంగళ ద్రవ్యాలు మేళతాళములతో ఊరేగింపుగా వచ్చి స్వామివారి శాంతి కల్యాణ ఉత్సవము వైభవోపేతముగా జరుపబడుచున్నది.
తదనంతరం 1958 వ సంవత్సరం లో శిధిలావస్థకు చేరిన ధ్వజస్థంభమును అప్పటి ధర్మకర్త గా పనిచేయుచున్న కొమరగిరి శ్రీ వేంకట అప్పారావు గారు, శ్రీ పరాంకుశం గోపాలాచార్యులవారి ఆశీస్సు లతో, శ్రీ పరాంకుశం రంగాచార్యుల వారి ఆద్వర్యంలో నూతన జీవ ధ్వజ పునఃప్రతిష్ట కావించినారు.
శ్రీ వేంకట అప్పారావు గారి తదనంతరం మూడవ కుమారుడైన అయిన శ్రీ కొమరగిరి చంద్రకాంతా రావు గారు ధర్మకర్తగా వ్యవహరించినారు .
కాలానుగుణము లో ఆలయం మరియు జీవధ్వజం శిథిలావస్థకు చేరుకొనగా ప్రస్తుత ధర్మకర్తగా ఉన్న శ్రీ వేంకట అప్పారావు గారి అయిదవ కుమారుడు శ్రీ కొమరగిరి రఘురామారావు నిర్వహణ లో శ్రీ పరాంకుశం రంగాచార్యులు, శ్రీ పరాంకుశం నారాయణాచార్యుల వారి ఆశీస్సులతో,
ఆలయ వంశ పారంపర్య అర్చకులు శ్రీ పరాంకుశం విఖనసాచార్యులు, శ్రీ అనిల్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో నూతన జీవ ధ్వజ పునఃప్రతిష్ఠ శ్రీ గజ్జి కృష్ణమూర్తి దంపతుల సహకారం తో మరియు విమాన గోపుర నిర్మాణం దేవాదాయశాఖ, భక్తుల సహకారం తో 2016 సంవత్సరంలో అత్యంత వైభవముగా జరిగినవి.
కొంతమంది భక్తుల సహకారం తో కళ్యాణ మండపం 2022 సంవత్సరంలో నిర్మించడం జరిగింది.
ప్రతి దినం నిత్య ధూప, దీప నైవేద్యములు, ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఉత్సవ మూర్తులను మేళతాళములతో గ్రామంలో ఊరేగింపు సేవల అనంతరం కల్యాణ మహోత్సవము, కృష్ణాష్టమి నాడు గ్రామోత్సవం,ఉట్టి కొట్టే కార్యక్రమములు , భాద్రపద మాసంలో వినాయకుని నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులు,బతుకమ్మ ఆటలు, కార్తీక మాసంలో ధ్వజస్తంభ పూజ ఆకాశ దీపోత్సవం , దాతల సహకారంతో అయ్యప్పల దీక్షా సమయంలో దీక్షా స్వాములకు మండలం రోజులపాటు ఉచితభోజనాలు మొదలగు కార్యక్రమములు ఘనం గా కనుల పండుగగా అత్యంత వైభవముగా నిర్వహించబడుచున్నవి.
పరాంకుశం విఖనసాచార్యులు ఆలయ వంశ పారంపర్య అర్చకులు
శ్రీ కొమరగిరి రఘురామారావు
వంశ పారంపర్య ధర్మకర్తలు